హైదరాబాద్‌కు అంకాపూర్‌ చికెన్‌

28 Oct, 2020 11:11 IST|Sakshi

సిద్దిపేట అప్పాలు.. కరీంనగర్‌ సర్వపిండి

తెలంగాణ హస్తకళలు, చేనేత వస్త్రాలు

బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆర్టీసీ కార్గో సేవలు

గ్రేటర్‌లో ఇప్పటివరకు 5.2 లక్షల పార్శిళ్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తరహాలో పరుగులు  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకే కాదు సరుకులకు సైతం రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఒక ఊరు నుంచి మరో ఊరుకు ప్రయాణికులను చేరవేసినట్లుగానే సరుకులను చేరవేస్తున్నాయి. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు మొదలుకొని అత్యవసరమైన మందులు, ఆహార పదార్థాలు, పిండివంటల వరకు కార్గో బస్సుల్లో పరుగులు తీస్తున్నాయి. టికెట్టేతర ఆదాయ సముపార్జనలో భాగంగా  కార్గో, పార్శిల్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేక హస్తకళా వస్తువులు, ఆహార పదార్థాలు, పిండి వంటలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఇప్పటి వరకు  గ్రేటర్‌లో 5.2 లక్షలకుపైగా పార్శిళ్లను వినియోగదారులకు అందజేసింది. జూన్‌ నుంచి రూ.2కోట్లకుపైగా  ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌ వంటి  సంస్థల తరహాలో నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే  వస్తువులను చేరవేసేందుకు సన్నద్ధమవుతోంది. కొద్దిరోజుల్లో ఆర్టీసీ పార్శిల్, కార్గో సేవలు ఆన్‌లైన్‌లోనే లభించనున్నాయి.  

అంకాపూర్‌ టు హైదరాబాద్‌...
నిజామాబాద్‌లోని అంకాపూర్‌లో లభించే చికెన్‌కు హైదరాబాద్‌లో ఎంతో క్రేజ్‌ ఉంటుంది. ఆ ఊళ్లో చికెన్‌ కర్రీను తయారు చేసి విక్రయించే వ్యక్తులకు ఇటీవల కాలంలో ఆర్టీసీ పార్శిళ్ల  ద్వారా డిమాండ్‌ పెరిగింది. ప్రత్యేకమైన మసాలాలతో, ఎంతో రుచిగా వండడం వల్ల అంకాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు వందలాది పార్శిళ్లు రవాణా అవుతున్నాయి. పార్శిల్‌ చార్జీలతో సహా కిలోకు రూ.650 చొప్పున తీసుకుంటున్నారు. “వీకెండ్స్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఒకటి, రెండు రోజులు ముందే ఆర్డర్‌ ఇస్తారు. మరుసటి రోజు ఉదయం  10 గంటలకల్లా పార్విళ్లు జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్‌లకు చేరుతాయి. ప్రతిరోజూ 30 నుంచి 50  కిలోల చికెన్‌ హైదరాబాద్‌కు పార్శిల్‌ చేస్తున్నారు.  

పిండివంటల నుంచి.. హస్తకళల దాకా..  
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే పిండివంటలను కూడా ఆర్టీసీ వినియోగదారులకు చేరువ చేస్తోంది. సిద్దిపేట సకినాలు, అప్పచ్చులు, కరీంనగర్‌లో ప్రత్యేకంగా వండే సర్వపిండి వంటివి ఇప్పుడు  హైదరాబాద్‌లో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా పొందవచ్చు. “ఒకరోజు ముందు ఆర్డర్‌ చేస్తే తయారీ సంస్థల నుంచి సేకరించి వినియోగదారులకు అందజేస్తాం’ అని చెప్పారు ఆర్టీసీ  ప్రత్యేక అధికారి కృష్ణకాంత్‌. నిర్మల్‌ బొమ్మలు, పెంబర్తి హస్తకళా వస్తువులు, పోచంపల్లి, గద్వాల్‌  చీరలు, చేనేత వస్త్రాలను వినియోగదారులకు చేరవేసేందుకు ఆర్టీసీ పార్శిల్‌ సేవలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 150 కార్గో  బస్సుల ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు.

  
నేరుగా ఇంటి వద్దకే సేవలు..
ఇటు వినియోగదారుల నుంచి అటు తయారీదారులు, వ్యాపార సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించడంతో నేరుగా వినియోగదారులకు ఇంటి వద్దే పార్శిళ్లను అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ  మేరకు  ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొంటే చాలు. ఆయా సంస్థల నుంచి అందిన వెంటనే పార్శిల్‌ సర్వీసుల ద్వారా ఆర్టీసీ ఏజెంట్లకు, అక్కడి నుంచి వినియోగదారుల ఇంటికి చేరుస్తారు.   

చార్జీలు చాలా తక్కువ..
సిరిసిల్లకు కొన్ని వస్తువులను పంపిస్తున్నాను. బయట కంటే చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.150తోనే పని అయిపోయింది. చాలా బాగుంది.  
– శ్రీపతిరావు, వినియోగదారు

ఇదే మొదటిసారి..  
కార్గో సేవలను వినియోగించుకోవడం ఇదే మొదటిసారి. ఇంటి నుంచి కొన్ని వస్తువులను నిర్మల్‌కు పంపిస్తున్నా. మిగతా సంస్థల కంటే ఆర్టీసీని నమ్ముకోవడం మంచిది కదా.
– బూదయ్య, వినియోగదారు

ఆర్టీసీ వల్లే పార్శిల్‌ ఆలోచన..
అంకాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు చికెన్‌ పంపించవచ్చనే ఆలోచన ఆర్టీసీ పార్శిల్‌ సేవల వల్లే వచ్చింది. అప్పటి వరకు లోకల్‌గానే విక్రయించేవాళ్లం. ఇప్పుడు చాలా బాగుంది.
– చంద్రమోహన్, చికెన్‌ తయారీదారు, అంకాపూర్‌   

స్పందన బాగుంది.. 
పార్శిల్‌ సేవలకు స్పందన చాలా బాగుంది. జేబీఎస్‌ నుంచి ప్రతిరోజూ రూ.85 వేలకు పైగా ఆదాయం లభిస్తోంది. వందలాది పార్శిళ్లను  వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నాం,  
– ప్రణీత్, డిపో మేనేజర్, పికెట్‌ 

మరిన్ని వార్తలు