ఆర్టీసీకి అశోక్‌ లేలాండ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు

11 Feb, 2023 03:46 IST|Sakshi

అద్దె ప్రాతిపదికన తీసుకోనున్న సంస్థ 

జీసీసీ పద్ధతిలో నిర్వహించనున్న లేలాండ్‌ 

కి.మీ.కు నిర్ధారిత మొత్తం చొప్పున చెల్లింపు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన నిర్వహించనుంది. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకునే ఎలక్ట్రిక్‌ బస్సులను ఆ కంపెనీ నుంచే తీసుకోనుంది. అయితే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ, వాటిని సొంతంగా కొనకుండా గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) పద్ధతిలో అద్దెకు తీసుకోనుంది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో ఇక బస్సులను సరఫరా చేయాల్సి ఉంది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. అయితే అశోక్‌ లేలాండే వాటిని నిర్వహిస్తుంది కాబట్టి, అందుకు ప్రతిగా ఆ సంస్థకు ఆర్టీసీ కి.మీ.కు నిర్ధారిత మొత్తం చొప్పున అద్దెను చెల్లిస్తుంది.  

మూడేళ్లలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు 
ఇంతకాలం డీజిల్‌ బస్సులనే నడుపుతున్న టీఎస్‌ ఆర్టీసీ క్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు చూస్తోంది. భారీగా పెరిగిన డీజిల్‌ ధర ఆర్టీసీపై భారం పెంచుతోంది. దీంతో క్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు మళ్లటం ద్వారా ఆ ఖర్చును తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది. కానీ డీజిల్‌ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సుల ధర చాలా ఎక్కువ. ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీలో తిరిగే డీజిల్‌ బస్సు రూ.35 లక్షలు పలుకుతుంటే, నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సు ధర రూ.కోటిన్నర వరకు పలుకుతోంది.

అంత మొత్తం వెచ్చించి వాటిని కొనటం ఆర్టీసీకి తలకు మించిన భారంగా మారింది. దీంతో జీసీసీ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో మూడు వేల ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ, ఇప్పుడు అశోక్‌ లేలాండ్‌ కంపెనీ నుంచి 500 బస్సులు సమకూర్చుకోనుంది. టెండర్ల ప్రక్రియలో ఆ సంస్థ ఎల్‌1గా నిలవటంతో దానికే బస్సుల నిర్వహణ బాధ్యత అప్పగించింది. కి.మీ.కు అద్దెను ఆ సంస్థ రూ.58గా కోట్‌ చేసింది. దాన్ని కనీసం రూ.54కు తగ్గించాలని ఆర్టీసీ కోరింది. దీనిపై ఆ సంస్థ ఇంకా తుది నిర్ణయం వెల్లడించలేదు. వచ్చే రెండు, మూడురోజుల్లో అది ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది.  

డిపోల్లో చార్జింగ్‌ వ్యవస్థలు 
ఎలక్ట్రిక్‌ బస్సులు పెరుగుతున్నందున, వాటి చార్జింగ్‌ కోసం డిపోల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏయే డిపోలకు ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయిస్తారో, ఆయా డిపోల్లో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు అవసరం. కాగా 33 కేవీ అవసరమా, 11 కేవీ సరిపోతుందా? అనే పరిశీలన జరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల స్థాయిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో ఆర్టీసీ ఈడీ వినోద్‌కు ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణ బాధ్యత ఉండేది. ఇప్పుడు ఓ అధికారి ప్రత్యేకంగా ఈ పనులకే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన నుంచి దాన్ని తప్పించి సీఎంఈకి కేటాయించారు.   

కి.మీ.కు రూ.79 
అశోక్‌ లేలాండ్‌ ఆర్టీసీకి డబుల్‌ డెక్కర్‌ బస్సులను కూడా సరఫరా చేయాల్సి ఉంది. తొలుత 10 బస్సులను ఆర్టీసీ తీసుకుంటోంది. ఇది కూడా జీసీసీ పద్ధతిలోనే అయినందున, దానికి కి.మీ.కు ఆ సంస్థ రూ.79ని అద్దెగా కోట్‌ చేసింది. అయితే దాన్ని కూడా కొంతమేర తగ్గించాలని ఆర్టీసీ కోరింది. త్వరలో దానిపై కూడా నిర్ణయం వెలువడనుంది.   

మరిన్ని వార్తలు