‘హృదయ’ వేదన.. అయ్యో.. చిన్నారికి ఎంత కష్టం..

17 Nov, 2021 12:48 IST|Sakshi

సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన ఈ పిల్లాడు ఆస్పత్రి బెడ్డుపై బిక్కుబిక్కుమంటున్నాడు. గుండెకు రంధ్రం పడి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బిడ్డడిని చూస్తూ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మేడిదపల్లి గ్రామానికి చెందిన బందారపు లింగేశ్వర్, శైలజ దంపతుల ఎనిమిది నెలల బాబు మోక్షిత్‌ గుండె సమస్యతో బాధపడుతున్నాడు.

నాలుగు నెలల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. పుట్టుకతోనే హృదయానికి రంధ్రం ఉందని అక్కడి వైద్యులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ హాస్పిటల్‌కు సిఫారసు చేయగా..పరీక్షించిన పెద్ద డాక్టర్లు ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని, రూ.12 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు.

ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాకపోవడంతో పెయింటింగ్‌ వర్కర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న లింగేశ్వర్‌.. ఇప్పటి దాకా రూ.3 లక్షలు అప్పుచేసి వైద్యం చేయించాడు. ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డడిని చూస్తూ.. చేతిలో డబ్బులు లేక కుమిలిపోతున్న ఆ అమ్మానాన్నల హృదయ వేదన అంతాఇంతా కాదు.  

దాతలు సాయం చేయాలి..
వైద్య సౌకర్యం ఉన్న ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలో లేకపోవడంతో మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని, తమ బిడ్డ మోక్షిత్‌ ఆపరేషన్‌కు దాతలు సాయం చేయాలని లింగేశ్వర్, శైలజ కోరుతున్నారు. దయార్థ్ర హృదయులు స్పందించాలని వేడుకుంటున్నారు. సెల్‌ నంబర్‌ 8179913499కు కాల్‌ చేసి కానీ, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కానీ..ఆర్థిక సాయం చేసి, ఆపరేషన్‌కు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు