Dubai: బుర్జ్‌ ఖలీఫాపై బంగారు ‘బతుకమ్మ’ 

24 Oct, 2021 04:56 IST|Sakshi

ఖండాంతరాలకు బతుకమ్మ సంబురం

తెలంగాణ పూల సంబురం విశ్వవ్యాప్తం

ఖండాంతరాలు దాటిన సాంస్కృతిక వైభవం  

తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. మన సాంస్కృతిక వైభవం ‘జై బతుకమ్మ’, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్‌’ అంటూ బుర్జ్‌ ఖలీఫాపై జిగేల్‌మని మిరుమిట్లుగొలిపింది. పూల సంబురం విశ్వవిఖ్యాతికెక్కింది.  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ‘బతుకమ్మ’ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో దుబాయిలోని అతి ఎత్తయిన కట్టడం బుర్జ్‌ ఖలీఫా తెరపై బతుకమ్మ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు పర్యాయాలు ప్రదర్శించారు.

‘జై తెలంగాణ’, ‘జై హింద్‌’నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాన్ని బుర్జ్‌ ఖలీఫా తెరపై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫా తెరపై కనిపించగానే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను తిలకించారు. 

దేశానికే గర్వకారణం: కవిత 
బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించడం పట్ల అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్‌ సంజయ్, బిగాల గణేష్‌ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌ సాగర్, దాస్యం విజయ్‌ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు