ఇంగ్లండ్‌ వెళ్లినా మూలాలు మరువలేదు

30 Mar, 2021 13:26 IST|Sakshi
అస్థికలకు పూజ చేస్తున్న యశ్వంత్, పక్కన ఫియానా, వివాన్, జీనా 

కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిమజ్జనం

సాక్షి, కాళేశ్వరం : కరీంనగర్‌ జిల్లా మంకమ్మతోటకు చెందిన యశ్వంత్‌ చదువు నిమిత్తం సుమారు ఆరేళ్ల క్రితం ఇంగ్లాండ్‌ వెళ్లిన సమయంలో ఆ దేశానికి చెందిన ఫియానాను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడగా, వారికి కుమారుడు వివాన్, అనంతరం కవల కుమార్తెలు జీనా, ఆంజీ జన్మించారు. ఆరేళ్ల క్రితం కవలల్లో ఒకరైన ఆంజీ అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటించే యశ్వంత్‌.. తన కుమార్తె అస్థికలను భారత నదీ జలాల్లో కలపాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి భద్రపరిచారు.

తాజాగా స్వస్థలానికి వచ్చిన ఆయన సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఆమె అస్థికలకు ప్రత్యేక పూజలు నిర్వహించాక త్రివేణి సంగమం గోదావరిలో కలిపారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇంగ్లండ్‌ వెళ్లినా భారత సంస్కృతిని విస్మరించని యశ్వంత్‌ను పలువురు అభినందించారు.
చదవండి: లేని కారుకు కిరాయి.. ఇదెలా సాధ్యం సార్‌!

మరిన్ని వార్తలు