మన చందు ‘బంగారం’

3 Jan, 2022 13:12 IST|Sakshi

సాక్షి, బచ్చన్నపేట(వరంగల్‌): ప్రతిభకు పేదరికం అడ్డురాదు. లక్ష్యం.. పట్టుదలకు కఠోర దీక్ష తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం అంజయ్యనగర్‌కు చెందిన బొలుగుల చందు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఐదో ఇంటర్నేషనల్‌ యూత్‌ నేపాల్‌ హీరో కప్‌ (అండర్‌–19) కరాటే కుంగ్‌ ఫూ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ సాధించాడు.  

తండ్రి ఆటో డ్రైవర్‌.. తల్లి కంకుల విక్రయం
బొలుగుల యాదగిరి, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు చందు. నిరుపేద కుటుంబానికి చెందిన యాదగిరి రోజూ ఆటో నడుపుతుండగా.. భార్య సునీత మొక్కజొన్న కంకులు విక్రయించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చందు 5వ తరగతి వరకు స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు మండల కేంద్రంలో చదువుకున్నాడు.

ప్రస్తుతం వరంగల్‌ జిల్లా నర్సంపేటలో డిగ్రీ ఫస్టియర్‌ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న చందు ఎనిమిదవ ఏట కరాటే కుంగ్‌ఫూ నేర్చుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన దొడ్డి శ్రీనివాస్‌ మాస్టర్‌ బచ్చన్నపేటకు వచ్చి కుంగ్‌ఫూ నేర్పించేవారు.

దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించేలా..
ఇంటర్నేషనల్‌ యూత్‌ నేపాల్‌ హీరో కప్‌ కుంగ్‌ఫూ పోటీల్లో 14 దేశాలు పాల్గొనగా.. భారతదేశం నుంచి బొలుగుల చందు బరిలోకి దిగాడు. పలు దేశాల క్రీడాకారులతో తలపడి విజయం సాధించిన చందు ఫైనల్స్‌లో కొరియా ప్లేయర్‌పై 5–4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలిరౌండ్‌లో భూటాన్‌పై 5–3, సెమీ ఫైనల్లో నేపాల్‌ ప్లేయర్‌పై 5–3 తేడాతో విజయాలను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన చందు పసిడి పతకం దక్కించుకున్నాడు.

దాతల సాయంతో నేపాల్‌కు..
ఫైనల్‌ పోటీలకు ఎంపికైన చందు నేపాల్‌కు వెళ్లడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. కనీసం రవాణా చార్జీలకు సైతం చేతిలో డబ్బులు లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన పలువురు దాతలు, అలాగే మంత్రి కేటీఆర్‌ సహాయంతో నేపాల్‌ వెళ్లాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ మెరుపు మెరిసిన చందును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు