అదనపు టీఎంసీ... ఆగినట్లే!

15 Dec, 2020 02:46 IST|Sakshi

ఎన్జీటీ తీర్పు, కేంద్రం తాజా ఆదేశాలతో బ్రేక్‌

కాళేశ్వరంలో మూడో టీఎంసీపై ముందుకు వెళ్లలేని పరిస్థితి..

ఇటీవలే రూ.21వేల కోట్లతో 8 ప్యాకేజీల్లో మొదలైన పనులు     మిగతా ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించేందుకు ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్ ‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్‌ పడనుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రానికి అందిన ఆదేశాలు, ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో.. నెలరోజుల కిందటే రూ.21 వేల కోట్లతో చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. మూడో టీఎంసీ ఎత్తిపోత పనులను కొత్త ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నందున... ఆ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు పనులు కొనసాగించే అవకాశాలు లేవని ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

ఆదిలోనే హంసపాదు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరంభించి కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా నాలుగు ప్యాకేజీలకు రూ.9,747.30 కోట్లతో, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు మరో నాలుగు ప్యాకేజీలకు రూ.11,710.70 కోట్లతో టెండర్లు పిలిచారు. టెండర్ల ప్రక్రియ మే నెలలో ముగిసింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీపీఆర్‌లు సమర్పించాలని, కేంద్ర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించరాదని తెలిపింది. ఫలితంగా రాష్ట్రం ముందడుగు వేయలేదు.

ఎన్జీటీ ఉత్తర్వులు అడ్డంకే
దీంతో పాటే అదనపు టీఎంసీ పనులపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్‌లో తుదితీర్పును వెలువరించిన ఎన్టీటీ, కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘గోదావరి బోర్డుకు డీపీఆర్‌ ఇవ్వకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని ఆగస్టులోనే కేంద్రమంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు ఎలాంటి ప్రతిపాదన తమవద్దకు రాలేదని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దీనికి కొత్తగా అనుమతులు అవసరమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్‌ 2న తెలంగాణ సీఎం కేంద్రానికి రాసిన లేఖను జల్‌శక్తి శాఖ పరిశీలించాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’అని తన తుదితీర్పులో ఎన్జీటీ పేర్కొంది.

అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గతనెలలో ఎనిమిది ప్యాకేజీల పరిధిలో అదనపు టీఎంసీ పనులను రాష్ట్రం ఆరంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి లేఖపై ఈనెల 11న స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, అదనపు టీఎంసీ పనులను పూర్తిగా కొత్త డిజైన్‌గానే చూస్తామని, మార్పు ఏదైనా జరిగినప్పుడు కేంద్ర హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పెట్టుబడులు, పర్యావరణ తదితర అనుమతులను పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి మదింపు తప్పనిసరని, అది జరిగే వరకు ప్రాజెక్టుపై ముందుకెళ్లరాదని స్పష్టం చేశారు.

ఇప్పటికే వెలువడిన ఎన్జీటీ ఉత్తర్వులు, కేంద్రం తాజా ఆదేశాల నేపథ్యంలో పనులను కొనసాగించే అవకాశం ఇరిగేషన్‌ శాఖకు లేకుండా పోయింది. కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. పనులను ఏమాత్రం కొనసాగించినా పిటిషనర్లు తిరిగి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఇరిగేషన్‌ వర్గాలు తెలిపాయి.

మిగతా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఓకే
కాళేశ్వరంతో పాటు సీతారామ ఎత్తిపోతల, జీఎల్‌ఐఎస్‌ ఫేజ్‌–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు, లోయర్‌ పెన్‌ గంగపై బ్యారేజి, రామప్ప సరస్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, బోర్డుల మదింపు జరగనంతవరకు ముందుకు వెళ్లరాదని సైతం కేంద్రమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇరిగేషన్‌ శాఖ సిధ్దం చేస్తోంది. అయితే మిగతా చోట్ల పనులను పూర్తిగా నిలిపివేసే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై కోర్టులను ఆశ్రయించే అవకాశాలను సైతం రాష్ట్రం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో న్యాయనిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు