మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్‌.. కొత్తవి నాటండి: కేసీఆర్‌  

11 Jun, 2021 13:55 IST|Sakshi

తూప్రాన్‌–గజ్వేల్‌ మధ్య మొక్కల దుస్థితిపై సీఎం కేసీఆర్‌ ఆరా 

వెంటనే కొత్తవి నాటాలని కాన్వాయ్‌ నుంచే ఫోన్‌  

సాక్షి, గజ్వేల్‌: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోవడంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. ఇటీవల ప్రభుత్వ విప్, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తండ్రి మృతి చెందగా.. బుధవారం సుమన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం, తిరుగు ప్రయాణంలో తూప్రాన్‌.. అక్కడి నుంచి గజ్వేల్‌ మీదుగా ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌కు చేరుకున్నారు.

మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్నిచోట్ల ట్రీగార్డులు పడిపోవడం, మరికొన్ని చోట్ల మొక్కలు ఎండిపోవడం గమనించారు. ఎందుకిలా జరిగిందని కాన్వాయ్‌ నుంచే ‘గడా’(గజ్వేల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. గతేడాది నర్సాపూర్‌ నియోజకవర్గానికి గజ్వేల్‌ నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ నిర్మించడంతో మొక్కలు దెబ్బతిన్నాయని ముత్యంరెడ్డి సీఎంకు వివరించారు. అయితే వాటి స్థానంలో కొత్తవి ఎందుకు నాటలేదని ప్రశ్నించిన సీఎం  వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోనూ రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న మొక్కల స్థానంలో తిరిగి కొత్త మొక్కలు నాటాలన్నారు. దీంతో గురువారం ‘గడా’ప్రత్యేకాధికారి.. తూప్రాన్‌  నుంచి గజ్వేల్‌ వరకు దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు చర్యలు ప్రారంభించారు. పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

చదవండి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు