హుజూరాబాద్‌.. నాలుగు ఆప్షన్లు 

23 Aug, 2021 00:55 IST|Sakshi

కాంగ్రెస్‌ అధిష్టానం కోర్టులోకి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక వ్యవహారం 

కొండా సురేఖతోపాటు ఎస్సీ నేత కవ్వంపల్లి సత్యనారాయణ పేరు పరిశీలన 

స్థానిక కోటాలో పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్‌ పేర్లు 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో రాష్ట్రస్థాయిలో పలు అభిప్రాయాలు వచ్చినందున అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని అధిష్టానం కోర్టులోకి నెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఉన్నా అభ్యర్థి ఖరారు కాకపోవడంతో దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ నాలుగు పేర్లను అధిష్టానం పరిశీలనకు పంపినట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రి కొండాసురేఖ పేరు మొదటి వరుసలో ఉండగా, ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక నేతలు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్‌ పేర్లు ఉన్నాయి.  

సురేఖ పేరు ఖరారైనా... 
వాస్తవానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారైంది. ఈనెల 18న రావిర్యాలలో జరిగిన సభలో ఆమె పేరును ప్రకటిస్తారని, మరుసటి రోజున సురేఖ పుట్టినరోజు వేడుకలను హుజూరాబాద్‌ కేంద్రంగా జరుపుకుంటారనే చర్చ జరిగింది. కానీ, అలా జరగలేదు. ఇందుకు స్థానిక అభ్యర్థిని పోటీలో ఉంచాలనే డిమాండ్‌ గట్టిగా వినిపించడమే కారణమని తెలుస్తోంది. మహిళతోపాటు నియోజకవర్గంలో పెద్దసంఖ్యలోనే ఉన్న మున్నూరుకాపు, పద్మశాలీ ఓట్లు పడతాయనే కోణంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ ఆ తర్వాత పార్టీలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ అభ్యర్థి అయితే మహిళాస్త్రం ఉపయోగపడుతుందని, కానీ, బీజేపీ తమ అభ్యర్థిగా రాజేందర్‌ సతీమణి జమునను ఖరారు చేస్తే సురేఖ ఎంపిక టీఆర్‌ఎస్‌కు మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది.

దీంతోపాటు ముగ్గురూ బీసీ అభ్యర్థులే అయితే ఇతర వర్గాల ఓట్లను టీఆర్‌ఎస్‌ సులువుగా మేనేజ్‌ చేయగలుగుతుందనే వాదన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీలు బీసీ అభ్యర్థిని దింపుతున్నందున కాంగ్రెస్‌ పక్షాన ఎస్సీ అభ్యర్థిని నిలపాలని, అప్పుడు దళితబంధు ఓట్లను కూడా గంపగుత్తగా టీఆర్‌ఎస్‌కు పడకుండా అడ్డుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు పరిశీలనకు వచ్చింది. ఈయనకు తోడు స్థానిక నేతలు పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్‌లతో పాటు పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య అభ్యర్థిత్వాలపై కూడా దామోదర రాజనర్సింహతో మాణిక్యం ఠాగూర్‌ చర్చించినట్టు తెలిసింది. వీరిలో సురేఖ, సత్యనారాయణలలో ఒకరిని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్టానం రెండు, మూడు రోజుల్లోపు ప్రకటిస్తుందని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి.

మరిన్ని వార్తలు