తుఫాన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణకు భారీ వర్ష సూచన

7 May, 2023 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మోస్తరు నుంచి భారీవర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. 

శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 8న అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 9న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆ తర్వాత దాదాపు ఉత్తరందిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరమై తుపానుగా బలపడే అవకాశం ఉంది. 

దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉంది. శనివారం నల్లగొండలో 38.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. 

ఇది కూడా చదవండి: ఏపీకి వర్ష సూచన.. మూడు రోజులు వానలు

మరిన్ని వార్తలు