పార్వతీ బ్యారేజీ: డెలివరీ సిస్టర్న్‌ వద్ద కుంగిన భూమి 

30 Jun, 2021 07:59 IST|Sakshi
బ్యారేజీ డెలివరీ సిస్టం సమీపంలో కుంగిన భూమి  

దెబ్బతిన్న పార్వతీ బ్యారేజీ నాలుగో మోటార్‌ పైపు

మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో నిర్మించిన పార్వతీ బ్యారేజీ డెలివరీ సిస్టర్న్‌కు ఉన్న పైపులైన్‌లో నాల్గో మోటార్‌ పైపు వద్ద భూమి కుంగిపోయింది. పంపు మోటార్‌ నీటి ప్రవాహం తాకిడికి పైపు పైకి లేచింది. సుమారు 200 మీటర్ల మేర పైపుపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతీ పంపుహౌస్‌ నుంచి 12 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి పార్వతీ బ్యారేజీకి పైపులైన్‌ నిర్మించారు. ఈనెల 18 నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరదనీరు పైపులైన్‌ కిందకు చేరింది.

పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోస్తున్న క్రమంలో పైపులైన్‌లో వేగంగా నీటి ప్రవాహం ఉండటంతో డెలివరీ సిస్టర్న్‌ నుంచి వచ్చే ప్రెషర్‌కు పైపు పైకి లేచింది. సుమారు మూడు మీటర్ల ఎత్తున పైపుపైకి లేచి వంకర తిరిగింది. ఎత్తిపోతలకు అంతరాయం ఏర్పడంతో తేరుకున్న నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు చేపట్టారు. భూమి కుంగిన చోట మొరం పోస్తున్నారు. డెలివరీ సిస్టర్న్‌ వద్ద మట్టిని తవ్వడం, అటు తర్వాత నింపడంతో భూమి కుంగిపోయిందని, ఇలా జరగడం సర్వసాధారణమని అధికారులు అంటున్నారు. మంగళవారం ఐదు మోటార్ల ద్వారా 14,,650 క్యూసెక్కుల నీటిని పార్వతీ బ్యారేజీలో ఎత్తిపోశారు. 
 

మరిన్ని వార్తలు