ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు: టీ కాంగ్‌ నేతలపై డిగ్గీ రాజా సీరియస్‌

22 Dec, 2022 16:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ జాతీయ స్థాయి సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ గట్టిగానే క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటకు చెక్‌ పెట్టే దిశగా ఏఐసీసీ ఆయన్ని రాష్ట్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన గాంధీభవన్‌కు వెళ్లారు. 

పార్టీ నేతలతో విడివిడిగా మాట్లాడిన ఆయన.. వాళ్లను గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది.  పార్టీలో జూనియర్‌, సీనియర్‌ పంచాయితీ మంచిది కాదని ఆయన నేతలకు సూచించారు. అంతేకాదు.. సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరు ఏం పని చేస్తున్నారో అధిష్టానం అంతా గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్‌ చూస్తూ ఊరుకోదని వాళ్లకు ఆయన స్పష్టం చేశారు. 

అంతకు ముందు అసమ్మతి నాయకులతో విడివిడిగా మాట్లాడి.. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. తర్వాత పీఏసీ సభ్యుల కమిటీ (22 మంది)తో చర్చలు జరిపారు. ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రేవంత్‌ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్‌ వ్యవహారశైలి, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం సహా పలు అంశాలపై అసంతృప్తులు నివేదికలు సిద్ధం చేసుకుని.. దిగ్విజయ్‌ సింగ్‌కు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటపై దిగ్విజయ్‌ సింగ్‌ పాత్రికేయ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మరిన్ని వార్తలు