మున్సిపాలిటీల్లో అవిశ్వాసం ఆపాలన్న పిటిషన్ల కొట్టివేత

7 Oct, 2023 03:36 IST|Sakshi

చట్టప్రకారం అవిశ్వాస తీర్మాన ప్రక్రియ 

28 పిటిషన్లకు కలిపి ఒకే తీర్పు ఇచ్చిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఆపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్లు దాఖలు చేసిన 28 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 9న కౌన్సిలర్లు తనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్‌ స్వీకరించడం, సంబంధిత ప్రక్రియ ప్రారంభించడాన్ని గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నేతి చిన్న రాజమౌళి హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరుతూ కౌన్సిలర్ల తరఫున గౌరారం రాజశేఖర్‌రెడ్డి కేవియట్‌ దాఖలు చేశారు.

ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అవిశ్వాసాలను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ఏప్రిల్‌లో తీర్పు రిజర్వు చేశారు. కొత్త తెలంగాణ మునిసిపాలిటీల చట్టం–2019 ప్రకారం చైర్‌పర్సన్‌ లేదా వైస్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎలాంటి నిబంధనలు రూపొందించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

అవిశ్వాస ప్రక్రియకు జారీ చేసిన నిబంధనలు ఏపీ మున్సిపాలిటీల చట్టం–1965 ప్రకారం రూపొందించినవని, అయితే అవి రద్దయ్యాయని పేర్కొన్నారు. కొత్త క్లాజ్‌లో సెక్షన్‌ 299, సెక్షన్‌ 299 (2)లను ఏపీ మునిసిపాలిటీల చట్టం నుంచే రూపొందించారని రాజశేఖర్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రతివాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చట్టప్రకారం అవిశ్వాస తీర్మాన ప్రక్రియ సాగుతుందని పేర్కొంటూ పిటిషన్లు కొట్టివేశారు. 

పిటిషన్లు వేసిన మున్సిపల్‌ చైర్మన్లు,వైస్‌ చైర్మన్లు వీరే... 
ఎరుకల సుధ(యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట చైర్‌పర్సన్‌), మంజుల రమేశ్‌(వికారాబాద్‌ చైర్‌పర్సన్‌), శంషాద్‌ బేగం(వికారాబాద్‌ వైస్‌ చైర్‌పర్సన్‌), తాటికొండ స్వప్న పరిమళ్‌(వికారాబాద్‌ జిల్లా తాండూరు చైర్‌పర్సన్‌), స్రవంతి(రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చైర్‌పర్సన్‌), కోతా ఆర్థిక (రంగారెడ్డి ఆదిబట్ల చైర్‌పర్సన్‌), ముత్యం సునీత(కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ చైర్‌పర్సన్‌), తోకల చంద్రకళ(నల్లగొండ జిల్లా చండూర్‌ చైర్‌పర్సన్‌), దోతి సుజాత(నల్లగొండ జిల్లా చండూర్‌ వైస్‌ చైర్‌పర్సన్‌), వి. ప్రణీత(మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ చైర్‌పర్సన్‌), మర్రి దీపిక(మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ చైర్‌పర్సన్‌), కరుణ అనుషారెడ్డి(నల్లగొండ జిల్లా నందికొండ చైర్‌పర్సన్‌), మందకుమార్‌ రఘువీర్‌(నల్లగొండ జిల్లా నందికొండ వైస్‌ చైర్మన్‌), వి.శంకరయ్య(యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చైర్మన్‌), గందే రాధిక(కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ చైర్‌పర్సన్‌), పోకల జమున(జనగాం జిల్లా జనగాం చైర్‌పర్సన్‌), శ్రీరాంప్రసాద్‌ మేకల(జనగాం జిల్లా జనగాం వైస్‌ చైర్మన్‌), గూడెం మల్లయ్య(సంగారెడ్డి జిల్లా ఆందోల్‌–జోగిపేట్‌ చైర్మన్‌), మేదరి విజయలక్ష్మి(సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి చైర్‌పర్సన్‌), దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు చైర్మన్‌), పిల్లోడి జయమ్మ(సంగారెడ్డి జిల్లా సదాశివపేట చైర్‌పర్సన్‌), నేతి చిన్న రాజమౌళి(సిద్దిపేట్‌ జిల్లా గజ్వేల్‌ చైర్మన్‌), అర్రగొల్ల మురళీధర్‌ యాదవ్‌(మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ చైర్మన్‌), వి.రాజు(యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ చైర్మన్‌), సుతకాని జైపాల్‌(ఖమ్మం జిల్లా వైరా చైర్మన్‌), సి.కిష్టయ్య(యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వైస్‌ చైర్మన్‌), ఎ.ఆంజనేయులు (యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చైర్మన్‌). వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.   

మరిన్ని వార్తలు