వావ్‌.. సిద్దిపేట!

15 Feb, 2021 17:46 IST|Sakshi

పల్లె అందాల సోయగాలకు ముగ్ధుడైన ఆండ్రూ ఫ్లెమింగ్‌

సిద్దిపేట జిల్లాలో మార్నింగ్‌ వాక్‌

ప్రకృతి అందాలను ట్విట్టర్‌ ఖాతాలో పోస్టింగ్‌   

సాక్షి, గజ్వేల్‌/వర్గల్‌/సిద్దిపేటజోన్‌: వృక్ష సొరంగం, పల్లె అందాల సోయగాన్ని చూసిన బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ముగ్ధుడయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని పలు గ్రామాలను మార్నింగ్‌ వాక్‌లో భాగంగా సందర్శించిన ఆయన, పల్లె అందాలను స్వయంగా కెమెరాలో బంధించి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రధానంగా వర్గల్‌ మండలంలోని నవోదయ విద్యాలయ సమీపంలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను వృక్ష సొరంగంగా అభివర్ణించారు.

సిద్దిపేట జిల్లా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ బస పేరుతో పల్లె అందాలను, వ్యవసాయ పనిముట్లుగా వాడే ఎడ్లబండి, నిండుకుండలా ఉన్న వర్గల్‌లోని పెద్దచెరువు, సైకిల్, గడ్డివాము రక్షణకు కట్టిన చీర, కనువిందు చేసిన గోగి పూవు తదితర భిన్నమైన దృశ్యాలను తన ట్విట్టర్‌ ఖాతాలో ఉంచారు. తన పోస్టులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సైతం ట్యాగ్‌ చేశారు. ఒకప్పుడు తాను చూసిన సిద్దిపేట జిల్లా.. ప్రస్తుతం ఊహించనంతగా మారిందని ప్రశంసించారు.  

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సిద్దిపేట ఎంతగానే మారిందని.. మూడేళ్ల క్రితం తాను చూసిన దానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు. నీరు పుష్కలంగా ఉండటంతో సాగు భూములు కనుచూపు మేర పచ్చదనం సంతరించుకుని శోభాయమానంగా కనువిందు చేస్తున్నాయని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు