జీవీకే స్కాం.. ఈడీ సోదాలు

28 Jul, 2020 12:26 IST|Sakshi

ముంబై, హైదరాబాద్‌లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు

సాక్షి, హైదరాబాద్‌: ముంబై ఎయిర్‌పోర్టు స్కాం కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. మంగళవారం ముంబై, హైదరాబాద్‌లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నిధుల అవకతవకలకు పాల్పడినట్లు జీవీకే గ్రూప్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఈ నెల 2న జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు జీవీరెడ్డి, సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. బోగస్‌ బిల్లులు, షెల్ కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ ఇప్పటికే జీవీకే పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. (జీవీకే గ్రూప్‌పై ఈడీ కొరడా)

దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్‌ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) పేరిట జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి.

2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్‌ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్‌ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్‌స్టక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్‌ ఇన్‌ఫ్రా ఇంజనీర్స్‌ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్‌ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్‌ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు