సాగు చట్టాలు నిలిపేయాలి

7 Feb, 2021 10:19 IST|Sakshi

కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతు ఏమైపోతాడు?

తెలంగాణ వచ్చాక పంటల దిగుబడి పెరిగింది

సీఎంగా కేసీఆర్‌ ఆలోచించింది రైతు గురించే..

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటనే మాటకు కట్టుబడి ఉన్నా

సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘దేశానికి అన్నం పెట్టే రైతు రోడ్డెక్కాడంటే పాలకుడు విఫలమైనట్టే. ఢిల్లీలో 70 రోజుల నుంచి ఎముకలు కొరికే చలిలో రైతులు ఎవరి కోసం ఉద్యమం చేస్తున్నారు? కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్టస్‌ అండ్‌ ప్రైసెస్‌ (సీఎసీపీ)లో ఉన్న ఐదుగురు సభ్యులు నిర్ణయించిన ధరను ప్రభుత్వం 100 శాతం అమలు చేయాలి. అదే కదా రైతులు అడుగుతున్నారు. కేంద్రం తక్షణమే స్పందించి.. కనీస మద్దతు ధరను ఎత్తేసే కుట్ర మానుకోవాలి. అలాగే కేంద్ర చట్టాలను పూర్తిగా నిలిపివేయాలి. దేశంలో భూమి విలువ ఎంత పెరిగినా.. రైతు వ్యవసాయమే చేస్తున్నాడనే విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలి’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నిర్మించిన ‘రైతు వేదిక’ భవనాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్న మంత్రి అక్కడి సభల్లో రైతులకు మద్దతుగా తన వాణి వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

వ్యవసాయమే ఆధారం...
మన దేశం తొలి నుంచి వ్యవసాయాధారితం. పంటలు పండించి అమ్ముకోవడమే మన ప్రధాన వృత్తి. 135 కోట్ల జనాభా గల మన దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించకపోతే మిగిలేవి ఆకలి చావులే. ఢిల్లీ రైతు ఉద్యమంలో సంఘవ్యతిరేక శక్తులున్నాయని, రాజకీయ ప్రోద్బలంతో ఉద్యమం జరుగుతోందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ఉద్యమం ఎప్పుడూ రాజకీయ ప్రోద్బలంతోనో, స్పాన్సర్‌షిప్‌తోనో జరగదు. 

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ 
రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్‌ ఆలోచించింది ఒక్కటే. వ్యవసాయం బాగుపడాలని. కాళేశ్వరం, రైతుబంధు, రైతుబీమాతో రాష్ట్రంలో రైతు తలెత్తుకొని బతికే స్థితికొచ్చాడు. పంటల విస్తీర్ణం విపరీతంగా పెరిగి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది. ఎఫ్‌సీఐ కొనకపోతే 60 నుంచి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఎవరు కొనాలి. రైస్‌మిల్లర్లు కొంటారా? కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతుల పరిస్థితి ఎట్లా అని రైతు వేదికల వద్ద అడుగుతున్నారు. ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తే గతంలో ఉన్నట్టే కొనుగోలు కేంద్రాలు కూడా ఉంటాయి.

ఆ మాటకు కట్టుబడి ఉన్నా..
ఓ ఇంటర్వ్యూలో.. కేసీఆర్‌ తగిన సమయం కేటాయించడం లేదు. ప్రభుత్వానికి సంబంధించి అన్నీ కేటీఆర్‌ సమర్థవంతంగా చూస్తున్నారు. ఆయన సీఎం అయ్యే టైమ్‌ వచ్చింది. కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి అని అన్నా. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నా. నాయకత్వ మార్పు ఎప్పుడు అనేది పార్టీ, అధినేత నిర్ణయిస్తారు. నేనెలా చెప్తా. ఏది జరగాల్సిన సమయంలో అది జరుగుతుంది

మరిన్ని వార్తలు