కుటుంబ ఆర్థిక భద్రతే అత్యంత ముఖ్యం.. భారతీయుల అభిప్రాయమిదే..!

19 Feb, 2023 08:29 IST|Sakshi

బజాజ్‌ అలయెంజ్‌ తాజా అధ్యయనంలో వెల్లడి 

82% వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్య్రం కోసం జీవిత బీమాలో పెట్టుబడులు పెడుతున్నామన్న వారు

పెట్టుబడులపై అభిప్రాయం ఏర్పరచుకోవడంలో సోషల్‌ మీడియా కీలకపాత్ర

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబాల ఆర్థిక భద్రతే తమకు సర్వోన్నతమైనదని, అదే  అత్యున్నత జీవిత లక్ష్యమని ఎక్కువ మంది భారతీయులు అభిప్రాయపడుతున్నట్లు తా­జా సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాతే వ్యక్తిగత కెరీర్, విదేశీ పర్యటనలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రు­ల బాగోగు­లు చూసుకోవడం వంటి అంశాలను లక్ష్యాలుగా నిర్దే శించుకుంటున్నట్లు తేలింది. కోవిడ్‌తో తలకిందులైన ఆర్థిక ప­రిస్థితులు, ప్ర­త్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రజలపై కరోనా ప్రభావాల నేపథ్యంలో భారతీ­యుల ప్రా­ధా­న్యతలపై లైఫ్‌ ఇండియాస్‌ లైఫ్‌ గోల్స్‌ ప్రిపేర్డ్‌నెస్‌ సర్వే 2023 పేరిట ప్రముఖ జీవితబీమా సంస్థ బజాజ్‌ అలయెంజ్‌ అధ్యయనం చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

  •  2019లో 51 శాతంతో పోలిస్తే 2023లో 84 శాతం మంది సమతూకమైన జీవనం (బ్యాలెన్స్‌డ్‌ లైఫ్‌) గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. 
  •  వృద్ధాప్యంలో ఆర్థిక స్వేచ్ఛ కోసం జీవిత బీమాలో పెట్టుబడులకు 82 శాతం ఇష్టపడుతున్నారు. 

సర్వేలోని ముఖ్యాంశాలు
ఉద్యోగ విరమణ అనంతరం భద్రతతో కూడిన, చింతలులేని జీవనం గడిపేందుకు వీలుగా జీవిత బీమా చేసేందుకు 77 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. 

వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్య్ర సాధన కష్టసాధ్యమనే భావనలో 67 శాతం ఉన్నారు. 

కరోనా అనంతరం ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా చేసేందుకు 73 శాతం మంది మొగ్గుతున్నారు. 

సొంతింటి కల సాకారమనేది ఇబ్బందితో కూడుకున్నదేనని 61% మంది భావిస్తున్నారు. 

వయసు పైబడిన తల్లిదండ్రుల బాగోగులు ‘ప్రయారిటీ లైఫ్‌ గోల్‌’గా 40 % మంది పేర్కొన్నారు. 

కరోనా మిగిల్చిన దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు.. 
కరోనా మిగిల్చిన దుష్పప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రజలు శ్రమిస్తున్నారు. కరోనా కాలంలో వారి ఆర్థిక పరిస్థితిపై ఏర్పడిన అనిశ్చితి కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా అనంతర పరిణామాల్లో కుటుంబ ఆర్థిక భద్రతకే పెద్దపీట వేస్తున్నారు. దీంతోపాటు ఇతరులపట్ల సానుభూ­తి పెరగ
డం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే భావనలు పెరిగాయి. బీమా కంపెనీలు సైతం ప్రతి ఏజ్‌గ్రూప్‌కు వర్తించేలా వివిధ బీమా ప్లాన్లు తీసుకొస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. 
– వీరేందర్, కన్సల్టెంట్‌ సైకాలజిస్ట్‌  

పెరిగిన లక్ష్యాలు..
దేశవ్యాప్తంగా ఢిల్లీ, లూథియానా, బరేలీ, కోల్‌కతా, పటా్న, భువనేశ్వర్, ముంబై, సూరత్, అమరావతి (మహారాష్ట్ర), చెన్నై బెంగళూరు, మధురై, గుంటూరులలో జరిగిన ఈ అధ్యయనంలో 2019తో పోలిస్తే 2023లో సగటు లక్ష్యాల సంఖ్య 5 నుంచి 11కు పెరిగింది. జీవిత లక్ష్యాలకు సన్నద్ధం కావడంలో ఆత్మవిశ్వాసం, అవగాహన, ఆర్థిక ప్రణాళికల కోసం తీసుకొనే చర్యలు వంటి అంశాలను ఈ సర్వేలో పరిశీలించారు. వివిధ పెట్టుబడులపై ప్రజలు అభిప్రాయాలు ఏర్పరుచుకోవడంలో సోషల్‌ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

కుటుంబ ఆర్థిక భద్రత, సమతూకమైన జీవితాన్ని గడపాలనే ప్రధాన లక్ష్యాలతోపాటు మరిన్ని కోరికలు  నెరవేర్చుకోవాలని సర్వేలో పాల్గొన్న భారతీయులు భావిస్తుండటం ఆసక్తికరం. ఇవి దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన బలమైన సిద్ధాంతాలను, భారతీయుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.     
– బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఢిల్లీ) ఎండీ, సీఈవో తరుణ్‌ ఛుగ్‌ 
 చదవండి: మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్.. పట్టాలకు ఫాబ్రికేషన్..

మరిన్ని వార్తలు