పోడు పోరులో చంటిబిడ్డల తల్లులు జైలుపాలు 

7 Aug, 2021 02:31 IST|Sakshi
జైలులోకి వెళ్లే ముందు చంటి పిల్లలతో ఆలకుంట మౌనిక, ఎత్తేరు కవిత

ఖమ్మం జిల్లాలో 23 మందిపై అటవీ అధికారుల కేసు

ఇప్పటికే 21 మంది అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

వారిలో ఏడాదిలోపు పిల్లలతో జైలుకెళ్లిన ముగ్గురు మహిళలు  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అటవీ అధికారులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌కు చెందిన పోడు భూముల సాగుదారుల అరెస్టు వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. మొత్తం 23 మందిపై కేసు నమోదవగా వారిలో గురువారం 12 మందిని, శుక్రవారం మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో 18 మంది మహిళలే ఉండటం గమనార్హం.

అయితే పోలీసులు అరెస్టు చేసిన వారిలో ముగ్గురు మహిళలకు ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డలు ఉండటం, వారిని సైతం పోలీసులు శుక్రవారం ఖమ్మం 3వ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి కోర్టు ఆదేశంతో 14 రోజుల రిమాండ్‌కు తరలించడంపై కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. తమపై ఫారెస్ట్‌ అధికారులు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ కేసులో ఆలకుంట రాణి ఏడాది వయసున్న తన కూతురితో గురువారం జైలుకెళ్లగా.. ఎత్తేరు కవిత 8 నెలల పాపతో, ఆలకుంట మౌనిక మూడు నెలల పాపతో శుక్రవారం జైలుకెళ్లింది. 

అసలేం జరిగిందంటే..
కొణిజర్ల మండలంలోని గుబ్బగుర్తి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్న సుమారు 20 హెక్టార్లలోని అటవీ భూమిలో ఎల్లన్ననగర్‌ వాసులు వేసిన పత్తి, కంది పంటలను తొలగించేందుకు ఇటీవల అటవీ అధికారులు రావడంతో స్థానిక మహిళలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం ఫారెస్ట్‌ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకొని పోడు సాగు దారులను వెళ్లగొట్టారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. 

అందరూ ఖండించాలి...
మహిళా రైతులపై అటవీ శాఖ రేంజర్‌ రాధిక కక్షగట్టి దాడులకు దిగుతోందని, తల్లీపిల్లలపై 307 హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించిన వైనాన్ని అందరూ ఖండించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మహిళలపై దాడి చేసి, దూషించినందుకు రేంజర్‌ రాధికపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

పత్తి తొలగించవద్దన్నందుకు..
20 ఏళ్లుగా ఎకరం భూమిలో పోడు కొట్టు కుని వ్యవసాయం చేస్తున్నాం. ఈ ఏడాది పత్తి సాగు చేశాం. అటవీ అధికారులు పత్తి పీకేస్తుంటే తొలగించొద్దని అడ్డుకు న్నాం. దాడి చేశామని మాపై కేసు పెట్టారు. నేను, నా భార్య తప్ప మాకెవరూ లేరు. మూడో బిడ్డ వయసు సంవత్సరం ఉంటుంది. ఆ పాపతోనే నా భార్య జైలుకు పోయింది.  
– ఆలకుంట శ్రీను, ఆలకుంట రాణి భర్త

అక్రమంగా కేసులు పెట్టారు... 
మేము అర ఎకరం పోడుచేస్తున్నాం. పచ్చని పంటను అటవీ అధికారులు నాశనం చేశారు. ఎంత బతిమిలాడినా వినలేదు. మాపై అక్రమంగా కేసులు పెట్టారు. మహిళలు అడ్డొస్తున్నారని, గూడెంలోని ఎక్కువ మంది మహిళలపై కేసులు పెట్టారు. నా బిడ్డ వయసు మూడు నెలలు. పాపతోనే నా భార్య జైలుకెళ్లింది. అటవీ అధికారులు మాపై కక్షకట్టారు. 
– జమలయ్య, ఆలకుంట మౌనిక భర్త

మరిన్ని వార్తలు