Gurukula Notification 2023: పూర్తిస్థాయి పీజీటీ, ఆర్ట్‌ టీచర్‌ నోటిఫికేషన్లు విడుదల

23 Apr, 2023 04:39 IST|Sakshi

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన టీఆర్‌ఈఐఆర్‌బీ 

పీజీటీలో 1,276 పోస్టులు, ఆర్ట్‌ టీచర్‌ కేటగిరీలో 132 ఖాళీలు

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రకటనలను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ నెల 5న టీఆర్‌ఈఐఆర్‌బీ 9,231 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను దరఖాస్తు సమయంలో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.

ఇందులో భాగంగా ఈ నెల 17న జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, లైబ్రేరియన్‌ కొలువులకు సంబంధించిన రెండు ప్రకటనలను విడుదల చేయగా... తాజాగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ (పీజీటీ), ఆర్ట్‌ టీచర్‌ కొలువులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటి ఫికేషన్లు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రక టనలన్నీ గురుకుల నియామకాల బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 ప్రకటనలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లు ఈ నెల 24న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు గురుకుల బోర్డు అధికారులు చెబుతున్నారు. 

1,276 పీజీటీ పోస్టులు... 
గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ పోస్టులు 1,276 ఉన్నాయి. ఇందులో అత్యధికం మహిళలకే రిజర్వ్‌ కావడం గమనార్హం. బాలికల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు వంద శాతం మహిళలకే కేటాయించడంతోపాటు బాలుర విద్యాసంస్థల్లో 33 శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ మేరకు పోస్టుల కేటాయింపులు జరిగాయి. ఈ క్రమంలో 966 పీజీటీ పోస్టులు మహిళలకు రిజర్వ్‌ కాగా... జనరల్‌ కేటగిరీలో 310 పోస్టులు వచ్చాయి. పీజీటీలోని మొత్తం పోస్టుల్లో మహిళలకు 75.70 శాతం ఉద్యోగాలు, జనరల్‌ కేటగిరీలో 24.30 శాతం రిజర్వ్‌ అయ్యాయి. 

ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు 132 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఆర్ట్‌ టీచర్‌ కేటగిరీలో 132 పోస్టుల భర్తీకి గురుకుల నియామకాల బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇందులో మహిళలకు 112 పోస్టులు రిజర్వ్‌ కాగా... జనరల్‌ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. మోత్తం పోస్టుల్లో మహిళలకు 84.85 శాతం కేటాయింపు కాగా జనరల్‌ కేటగిరీలో 15.15 శాతం పోస్టులు లభించాయి. 

మరిన్ని వార్తలు