ఆవిష్కరణలు.. అద్భుతం

14 Apr, 2023 04:16 IST|Sakshi

సోలార్‌ హ్యాండ్‌ డిష్‌ వాషర్‌కు మొదటి బహుమతి.. ఐఐటీహెచ్‌లో ఫ్యూచర్‌ ఇన్వెంటర్స్‌ ఫెయిర్‌ 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో గురువారం ఫ్యూచర్‌ ఇన్వెంటర్స్‌ (భవిష్యత్‌ ఆవిష్కర్తలు) ఫెయిర్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 24 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఈ ఫెయిర్‌లో ప్రదర్శించారు. కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్‌ డిష్‌ వాషర్‌కు మొదటి బహుమతి లభించింది.

ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు అనేది తమ నినాదం మాత్రమే కాదని, తమ విద్యాసంస్థ డీఎన్‌ఏ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలున్నాయని, సరైన మార్గదర్శకత్వం, సరైన వేదికలు లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలు చేయడం కాదు, ఉన్నత ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఈ నూతన ఆవిష్కరణలతో లభిస్తుందని చెప్పారు. కాగా ఈ ఫెయిర్‌లో మొత్తం ఐదు ఆవిష్కరణలకు బహుమతులు లభించాయి. 

సోలార్‌ హ్యాండ్‌ డిష్‌ వాషర్‌ 
వంట పాత్రలను శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడే నూతన సోలార్‌ హ్యాండ్‌ డిష్‌ వాషర్‌ను కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. అన్ని వైపులా తిరిగేందుకు వీలుండే ఓ మోటార్‌కు స్క్రబ్బర్‌తో కూడిన ప్రత్యేక పరికరం అమర్చారు. సౌర విద్యుత్‌తో పాటు, బ్యాటరీతో కూడా పనిచేసేలా దీనిని తయారు చేశారు.

అందుబాటులో ఉన్న సామగ్రితో తయారైన ఈ హ్యాండ్‌ డిష్‌ వాషర్‌కు ఫెయిర్‌లో మొదటి బహుమతి లభించింది. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే పాత్రలను శుభ్రం చేయడానికి పడుతున్న ఇబ్బందులను చూసి ఈ హ్యాండ్‌ డిష్‌ వాషర్‌ను రూపొందించామని విద్యార్థులు సాకేత్, హర్ష, ప్రణయ్, నవీన్, రక్షితలు పేర్కొన్నారు. 

పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్‌లు
రసాయనాలతో కూడిన శానిటరీ న్యాప్‌కిన్‌ లను వాడటంతో మహిళలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా ఇవి పర్యావరణానికి కూడా హాని చేస్తున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్‌ పల్లవి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు సహజ సిద్ధంగా లభించే పత్తి, అరటి ఫైబర్‌ (కాండంలో ఉండే నార), మొక్కజొన్న పిండి, వేప రసాన్ని వంటి వాటిని ఉపయోగించి న్యాప్‌కిన్‌లు తయారు చేశారు.

వీటివల్ల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావు. లీక్‌ ప్రూఫ్‌తో పాటు పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ న్యాప్‌కిన్‌లు అందుబాటు ధరలో లభించే అవకాశాలు న్నాయని విద్యారి్థనులు అక్షయ, హన్సి క, మానసలు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణకు రెండో బహుమతి లభించింది. 

అగ్ని ప్రమాదాలపై ‘డ్రయిడ్‌’ అలర్ట్‌ 
అగ్ని ప్రమాదాలపై అలర్ట్‌ చేయడంతో పాటు, ప్రమా దం జరిగినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం లేకుండా నివారించే ‘కెలామెటీ కంట్రోల్‌ డ్రయిడ్‌ ’ను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతపూర్‌) విద్యార్థులు ఆవిష్కరించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ డ్రయిడ్‌ అగ్నిప్రమాదం జరిగితే వెంటనే గుర్తించి., మొబైల్‌ టెక్నాలజీతో ఫైర్‌ స్టేషన్‌కు సమాచారాన్ని పంపుతుంది.

మంటలు విస్తరించకుండా నీటితో ఆర్పివేస్తుంది. సెన్సార్‌ల సాయంతో అగ్నిప్రమాదంలో ఎవరైనా మనుషులు చిక్కుకున్న విషయాన్ని కూడా పసిగట్టి ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం పంపుతుంది. ఈ ఆవిష్కరణకు తృతీయ బహుమతి వచ్చింది. విద్యార్థులు సూరజ్‌ గుప్తా, రిషిక్, కార్తికేయలు ఈ డ్రయిడ్‌ను ఆవిష్కరించారు.  

ఆటోలైట్‌ మెకానిజం ఎట్‌ కల్వర్ట్‌..  
కల్వర్టుల వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొనడం గానీ, పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొనడం వంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి కల్వర్టుల వద్ద ప్రమాదాల నివారణకు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఎక్స్‌లెంట్‌ స్టార్‌ హైసూ్కల్‌ విద్యార్థి రయాన్‌ ‘ఆటోలైట్‌ మెకానిజం ఎట్‌ కల్వర్ట్‌’అనే నూతన పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు.

కల్వర్టుల వద్ద ఆర్‌.ఎఫ్‌ ట్రాన్స్‌మీటర్, వాహనంలో ఆర్‌.ఎఫ్‌.రిసీవర్‌లను అమర్చ డం ద్వారా వాహనం లైట్‌ ఆటోమెటిక్‌గా లోయర్‌ డిప్పర్‌లోకి మారుతుంది. దీంతో ఎదు రుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి రోడ్డు ప్రమాదం తప్పుతుంది. దీనికి కన్సొలేషన్‌ బహుమతి వచ్చింది. 

ఉమెన్స్‌ ఫ్రెండ్లీ యుటెన్సిల్‌ సపోర్టర్‌..  
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను మహిళా సంఘాలే చూస్తున్నాయి. ఎక్కువ బరువున్న వంట పాత్రలను పొయ్యి పైనుంచి దించడం, అన్నం వార్చడం వంటి పనులు చేయలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. 

ఈ నేపథ్యంలో భారీ వంట పాత్రలోని అన్నాన్ని సులభంగా వార్చడానికి ఉపయోగపడే ఉమెన్స్‌ ఫ్రెండ్లీ యుటెన్సిల్‌ సపోర్టు పరికరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపకల్పన చేశారు. దీన్ని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంది. వినీల, నందు, శ్రీచైత్ర, సుప్రియ రూపొందించిన ఈ పరికరానికి కూడా కన్సొలేషన్‌ బహుమతి లభించింది.

మరిన్ని వార్తలు