‘సత్యాగ్రహ సభ’కు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

‘సత్యాగ్రహ సభ’కు సర్వం సిద్ధం

Published Fri, Apr 14 2023 4:08 AM

Today Congress party held a huge public meeting in Manchiryala - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంపీ సభ్యత్వం అనర్హత వేటును నిరసిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో తలపెట్టిన ‘సత్యాగ్రహ సభ’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు నస్పూర్‌ పట్టణం కొత్త కలెక్టరేట్‌ సమీపంలోని 22ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించనున్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజు, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జరుగుతున్న నేపథ్యంలో సభా ప్రాంగాణానికి ‘బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రాంగణం’ గా నామకరణం చేశారు.

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికయ్యాక రాష్ట్రంలో జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్ష మందిని తరలించేలా ప్రణాళిక వేశారు. 30వేల వరకు మహిళలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత నెల 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చేపట్టిన ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’యాత్ర బోథ్‌ నియోజకవర్గంలో మొదలై మంచిర్యాలకు చేరింది.

ఈ నేపథ్యంలో ఈ సభతోనే ఎన్నికల శంఖారావాన్ని మంచిర్యాల నుంచే పూరించాలని భారీగా జనాన్ని సమీకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో వచ్చేలా చూస్తున్నారు. 

గద్దర్‌ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు 
గద్దర్‌ నేతృత్వంలో సభలో సాంస్కృతిక కార్యక్రమాలు సాగనున్నాయి. ఇప్పటికే మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, రోడ్ల వెంట భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు గత రెండు రోజులుగా పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, విద్యార్థి, యువజన, మహిళా విభాగం నేతలు భాగస్వాములు అయ్యారు. గురువారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతోపాటు సీనియర్‌ నాయకులు సభాస్థలిని పరిశీలించారు. 

హెలికాప్టర్‌లో మంచిర్యాలకు ఖర్గే 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో మంచిర్యాల డిగ్రీ కాలేజీ మైదానం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుంటారు. సభలో పాల్గొన్నాక, రాత్రి మంచిర్యాల లోనే బస చేస్తారు. శనివారం హైదరాబాద్‌కు వెళ్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement