జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి

23 Feb, 2021 10:50 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి

హాజరైన కె.కేశవరావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్‌ చాంబర్‌లో విజయలక్ష్మి, ఒకటవ అంతస్తులోని డిప్యూటీ మేయర్‌ చాంబర్‌లో శ్రీలత సర్వమత ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు తీసుకునే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర మంత్రులు  తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కె.కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వారికి  శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల కోసం పనిచేస్తా : మేయర్‌ విజయలక్ష్మి 
నగర ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తానని సోమవారం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్‌ విజయలక్ష్మి ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర మేయర్‌గా ప్రమాణం చేయడం తనకు లభించిన సంపూర్ణ గౌరవమని, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 

చదవండి: షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ!

మరిన్ని వార్తలు