Sakshi News home page

రణరంగమైన జీహెచ్‌ఎంసీ

Published Thu, Aug 24 2023 4:02 AM

- - Sakshi

హైదరాబాద్: బల్దియా సర్వసభ్య సమావేశం రణరంగమైంది. ప్రతిపక్షాల నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లింది. బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిసరాల్లో వందలాది పోలీసులు పహారా కాశారు. తమను పర్మనెంట్‌ చేయాలంటూ కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న బల్దియా ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను బీజేపీ కార్పొరేటర్లు తమ వెంట తీసుకుని జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కొందరు కార్మికులను ఈడ్చి వాహనాల్లో పడేశారు. చెత్త ఊడ్చి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న తమను ప్రభుత్వం అత్యంత హీనంగా చూస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

మేయర్‌ చాంబర్‌ వద్ద బైఠాయింపు..
సమావేశాన్ని తొందరగా ముగించడంతో బయటకు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మేయర్‌ చాంబర్‌ వద్ద బైఠాయించారు. వీరి నినాదాలతో జీహెచ్‌ఎంసీ ప్రాంగణం హోరెత్తింది. ధర్నా చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేయర్‌ ఒక డమ్మీ అంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రావణి, మహాలక్ష్మిగౌడ్‌, ఫ్లోర్‌ లీడర్‌ శంకర్‌ యాదవ్‌లు ఆరోపించారు. తాము కొత్త హామీలను నెరవేర్చాలని అడగట్లేదు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం గతంలో ప్రకటించారని, ఆయన ప్రకటనను అమలు చేయాలని కోరితే కౌన్సిల్‌ని రద్దు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మేయర్‌ రద్దు చేయడం దారుణమంటూ విమర్శించారు. వారం రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే మేయర్‌ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తూ కౌన్సిల్‌ను అర్ధంతంగా రద్దు చేయించారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లను అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

ప్రొటోకాల్‌ రగడ
జీహెచ్‌ఎంసీలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని రాజకీయాల కతీతంగా అన్ని పార్టీలూ కోరాయి. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేదని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని.. ముఖ్యంగా వాటర్‌ బోర్డు పనుల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కార్పొరేటర్లు మండిపడ్డారు. వీధి దీపాలు, చెత్త సమస్యలు, డీసిల్టింగ్‌, నాలాల సమస్యలు తదితర సమస్యలపై ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదోపవాదోలతో సభను మేయర్‌ విజయలక్ష్మి త్వరితంగా ముగించారు. అందుకు నిరసనగా మేయర్‌ కార్యాలయం ఎదుట ప్రతిపక్షాలు ధర్నా నిర్వహించాయి. కార్మికుల సమస్యలు తెలిసేలా బీజేపీ సభ్యులు చెత్త తరలింపు కార్మికుల వేషధారణలతో ఆందోళన నిర్వహించారు. మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ముఖ్యాంశాలు ఇలా..

తెలంగాణ రాష్ట్రం వచ్చాక జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిని పర్మనెంట్‌ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానిని అమలు చేయాలని సభ్యులు మధుసూదన్‌రెడ్డి (బీజేపీ), రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్‌), సలీంబేగ్‌ (ఎంఐఎం)లు కోరారు. బీఆర్‌ఎస్‌ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ సమర్థించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచింది కూడా కేసీఆరే అన్నారు. ఆర్టీసీ కార్మికుల మాదిరిగానే సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తారని బీఆర్‌ఎస్‌ సభ్యులు అన్నారు. అందుకు ఎవరు అడ్డుపడ్డారో తెలుసునన్నారు. ఈ మేరకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. ఈ అంశంపై మేయర్‌ సూచన మేరకు కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ మాట్లాడుతూ.. మేయర్‌తో చర్చించి సభ్యుల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని చెప్పారు.

నిబంధనలు పాటించడం లేదు..
ఆయా పనుల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని, శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేయడం లేరని, ప్రారంభోత్సవాలకు చివరి నిమిషంలో సమాచారమిస్తున్నారని, ప్రారంభోత్సవాలకు వస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ డివిజన్‌ నాయకుల ఫొటో లేనందున వెళ్లిపోయిన సంఘటనలున్నాయని సభ దృష్టికి తెచ్చారు. వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినా పంద్రాగస్టు నాడు జెండా ఎగురవేసే దిక్కు లేకుండా పోయిందని, ప్రభుత్వ పథకాలైన కళ్యాణలక్ష్మి, దళితబంధువంటి వాటి పంపిణీ సందర్భంగా తమను ఆహ్వానించడం లేరని, అక్కడా ఎమ్మెల్యేల పెత్తనమే సాగుతోందన్నారు. ప్రొటోకాల్‌ పాటించడం లేదని మేయర్‌ అంగీకరించారు. ఇంటర్నల్‌ రాజకీయాల వల్లేనని అధికారి తెలపడంతో ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ రోనాల్డ్‌ రాస్‌ హామీ ఇచ్చారు.

వీధిదీపాలు, చెత్త, నాలాలు, వీధికుక్కలు తదితర సమస్యల్ని సభ్యులు ప్రస్తావించారు.

కార్పొరేటర్లకు గౌరవమివ్వకున్నా భరిస్తున్న మీరు బానిసలంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులనుద్దేశించి బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి చెప్పులు మోసేవారంటూ ఒకరు, కేసీఆర్‌ చెప్పులు మోసేవారంటూ ఒకరు రెండు పార్టీల వారు పరస్పరం వాదించుకున్నారు.

జడ్‌సీలు కార్పొరేటర్లతో నెలకోసారి సమావేశం పెడితే స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ సభ్యులు ప్రస్తావించారు.

పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.500 నుంచి అన్ని ప్రభుత్వాలు పెంచుతూవచ్చాయని, చరిత్ర తెలియనందున మేయర్‌ బీఆర్‌ఎస్సే పెంచిందన్నారని కాంగ్రెస్‌ సభ్యురాలు అనడంతో, మేయర్‌ను అవమానించారని, క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

మేయర్‌ అన్ని అంశాలను చర్చించకుండా సభను త్వరితంగా ముగించడంపై బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు మేయర్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించి మేయర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పార్కింగ్‌ ప్రదేశానికి తరలించారు.అక్కడా ధర్నాకు దిగడంతో పోలీస్‌ వ్యాన్లలోకి ఎక్కించారు.

► కార్మికులను పర్మనెంట్‌ చేయాలంటూ అన్ని పార్టీలూ కోరినా మేయర్‌ తీర్మానం చేయకపోవడంపై వారు మండిపడ్డారు.

మీడియాను కౌన్సిల్‌హాల్‌లోకి అనుమతించలేదు. నిరసనగా విషయాన్ని మేయర్‌కు తెలియజేయాలనుకున్న ప్రతినిధులను పట్టించుకోకుండా మేయర్‌ కౌన్సిల్‌ హాల్‌లోకి వెళ్లిపోయారు.

ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా త్వరగా ముగించారని బీజేపీ, కాంగ్రెస్‌ విమర్శించాయి.

 ఇక పోలీస్‌స్టేషన్ల వద్ద నిరసనలు
పార్టీలకతీతంగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో మొదటి అంశంగా ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల పర్మనెంట్‌ అంశాన్ని లేవనెత్తి, విషయాన్ని ప్రభుత్వానికి పంపేలా చేసిన కార్పొరేటర్లకు జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో కాకుండా పోలీస్‌స్టేషన్ల వద్ద నిరసన తెలియజేయాల్సిందిగా గోపాల్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి పోలీస్‌స్టేషన్ల వద్ద ఉంటూ శాంతియుతంగా సమస్యలపై నిరసన తెలియజేయాలని సూచించారు. సీఐ, ఎస్‌ఐలకు కార్మికుల సమస్యల గురించి వివరించాలని కోరారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగవద్దన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement