సోయా కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్‌

10 Sep, 2020 12:35 IST|Sakshi
సోయా కొనుగోలు కేంద్రం (ఫైల్‌)

సేకరణకు అంగీకరించిన నాఫెడ్‌ 

జిల్లాలో 74 వేల ఎకరాల్లో సాగు 

రైతులకు అందనున్న కనీస మద్దతు ధర 

సాక్షి, నిజామాబాద్‌: సోయా కొనుగోళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది కూడా సోయా సేకరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్‌ ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించిందని మార్క్‌ఫెడ్‌ వర్గాలు పేర్కొంటున్నారు. ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తుందనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి సోయా సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర దక్కే అవకాశాలున్నాయి. 

5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి 
వరి, మొక్కజొన్న తర్వాత జిల్లాలో అత్యధికంగా సోయా పంట సాగవుతుంది. ఈసారి 74,153 ఎకరాల్లో ఈ పంటను వేసుకున్నారు. విస్తారంగా  వర్షాలు కురియడంతో దిగుబడులు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాది ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల వరకు వస్తే ఈసారి మరో రెండు క్వింటాళ్లు అదనంగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున లెక్కేస్తే 74,153 ఎకరాలకు సుమారు 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంచనా. 

మార్కెట్‌ ధరపైనే ఆధారం.. 
కాగా సోయా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ.3,880 ఉంది. అయితే మార్కెట్‌ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర క్వింటాలుకు రూ.3,400 వరకు పలుకుతోంది. సోయాలు మార్కెట్‌కు వచ్చేసరికి ఇదే ధర ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సోయాలను విక్రయిస్తారు. ఏటా అక్టోబర్‌ మొదటి వారంలో సోయా కోనుగోళ్లు ప్రారంభమవుతాయి. మరో ఇరవై రోజుల్లో సోయాలు మార్కెట్‌లోకి వస్తాయి. దీంతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 

గత ఏడాది 16 వేల క్వింటాళ్ల సేకరణ.. 
గత ఏడాది ఖరీఫ్‌ కొనుగోలు సీజనులో జిల్లాలో 16,525 క్వింటాళ్లు సేకరించారు. 1,027 మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6.13 కోట్లు విలువ చేసే సోయాను కొనుగోలు చేశారు. అయితే ఈసారి మార్కెట్‌ రేట్‌ కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ఉంటుందని భావిస్తున్నారు.

జిల్లాల వారీగా అలాట్‌మెంట్‌ ఇస్తాం..
నాఫెడ్‌ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం జరిగింది. సోయా కొనుగోళ్లకు నాఫెడ్‌ అంగీకరించింది. రాష్ట్రంలో ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. నాఫెడ్‌ స్పష్టత ఇచ్చిన వెంటనే జిల్లాల వారీగా సోయా సేకరణకు అలాట్‌మెంట్‌ ఇస్తాము. – మార గంగారెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌
 

మరిన్ని వార్తలు