బిల్లులపై విచారణ 24కు వాయిదా

11 Apr, 2023 03:55 IST|Sakshi

రాజ్‌భవన్‌లో ఆగిన బిల్లులపై సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ వివరణ

మూడు బిల్లులే పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించారని, రెండు బిల్లులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. మరో రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ వెనక్కి తిప్పి పంపారని, ఇంకో మూడు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అందుబాటులో లేని కారణంగా.. విచారణ వాయిదా వేయాలని జూనియర్‌ న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వర్చువల్‌గా హాజరుకావడంతో వాదనలు వినిపించాలని ధర్మాసనం సూచించింది. గవర్నర్‌ నుంచి తనకు అందిన వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నట్టు తుషార్‌ మెహతా తెలిపారు.

‘శాసనసభ గతేడాది సెపె్టంబరులో పాస్‌ చేసిన కొన్ని బిల్లులు ఉన్నాయి కదా.. వాటిపై తుది నిర్ణయం ఏమైనా గవర్నర్‌ కార్యాలయం నుంచి అందిందా?’అని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించగా.. ఈ అంశాలపై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని తుషార్‌ మెహతా వివరించారు. ఈ క్రమంలో ధర్మాసనం.. సొలిసిటర్‌ జనరల్‌ అందజేసిన వివరాలను రికార్డుల్లోకి తీసుకుంటున్నామని పేర్కొంటూ, తెలంగాణ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. 

సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు ఇచ్చిన వివరాలివీ.. 
‘‘మూడు బిల్లులు.. తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపాలిటీస్‌ చట్ట సవరణ బిల్లు– 2023, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023లను గవర్నర్‌ ఆమోదించారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు–2022, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు–2022.. ఈ రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపివేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, నియంత్రణ) సవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు–2022, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (వయసు నియంత్రణ, పదవీ విరమణ) సవరణ బిల్లు–2022 గవర్నర్‌ క్రియాశీల పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు–2023కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌ వివరణ కోరారు. ఆజామాబాద్‌ ఇండ్రస్టియల్‌ ఏరియా (టర్మినేషన్, రెగ్యులేషన్‌ ఆఫ్‌ లీజు) సవరణ బిల్లు–2022కు న్యాయ విభాగం నుంచి వివరణపై స్పందన రాలేదు’’అని కోర్టుకు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు