Hyderabad Rains: మూడ్రోజులుగా ముసురుకుంది.. మరో 3 రోజులు వర్షాలే

11 Jul, 2022 08:22 IST|Sakshi

నగరంలో స్తంభించిన జనజీవనం

లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు

విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ  

సాక్షి, హైదరాబాద్‌: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. మేఘాలు వర్ష ధారలయ్యాయా అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు,  మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లిలలో 6, గాజుల రామారం ఉషోదయ కాలనీలో  5.6, బాలానగర్‌లో  5.3, మియాపూర్, జూపార్కులలో  5.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రాయదుర్గంలో కనిష్టంగా 4.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామంతాపూర్, కందికల్‌ గేట్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు  చెరువులను తలపించాయి.  మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరదనీటితో  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చదవండి: ప్రాజెక్టులకు వరద పోటు

ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాననీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.  

జంట జలాశయాలకు వరద ప్రవాహం 
మణికొండ: గత రెండు రోజులుగా శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో  గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) చెరువులోకి వరదనీరు పోటెత్తుతుండటంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్లను వదలి నీటిని కిందకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.80 అడుగులకు చేరుకుంది. పైనుంచి 208 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7,9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.


గండిపేట గేట్లను ఎత్తుతున్న అధికారులు 

దాంతో మూసీ నదిలో నీటి ప్రవాహం మొదలయ్యింది. గండిపేటలోని గేట్లకు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి, జలమండలి డీజీఎంలు నరహరి, వెంకట్‌రావులు పూజలు నిర్వహించి గేట్లను పైకి ఎత్తారు. రాత్రికి మరింత వరద ఎక్కువైతే అవే గేట్లను మరింత ఎత్తటం, మరిన్ని గేట్లను ఎత్తేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గండిపేట కౌన్సిలర్లు విజిత ప్రశాంత్‌ యాదవ్, నాయకులు గోపాల గణేష్, సీఐ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వరద నీటితో హిమాయత్‌సాగర్‌   

నిండుకుండలా హిమాయత్‌సాగర్‌.. 
బండ్లగూడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్‌ చెరువు వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులుగా ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలమండలి మేనేజర్‌ రేణుక, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌ల ఆధ్వర్యంలో 10, 5వ నంబర్‌ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు