Telangana Rains: దంచికొడుతున్న వానలు.. తడిసి ముద్దయిన తెలంగాణ.. ఎటు చూసినా నీరే!

12 Jul, 2022 12:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి.  నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు.

నిర్మల్‌ జిల్లా:
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిట్యాల గ్రామ సమీపంలో గల గోదావరి మధ్యలో ఉన్న కూర్రులో 9 మంది కౌలు రైతులు, వలస కూలీలు చిక్కుకున్నారు.  గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తుడటంతో కూలీలు భయందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ గోదావరి మట్టం పెరగడంతో తమను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. రాత్రి 12గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అడుగు తగ్గి  52 అడుగులకు చేరింది. అయితే మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. మాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్, చిన్న ఆలయాలు నీట మునిగాయి. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే ప్రధాన రాహదారి పై నుంచి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జనం ఏదైనా అత్యవసరం అవుతూనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. 

వరంగల్‌: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.  జలాశయాలన్ని జలకళను సంతరించుకుని చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. వరంగల్‌లో భద్రకకాళి చెరువు  పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయిదు చెరువులకు గండిపడగా పలుచోట్ల రోడ్లు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో రవాణా సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ముందస్తుగా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య అధికారులు తరలించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పునారావస కేంద్రాల ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వర్షం వరదలపై మహబూబాబాద్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షించారు. వర్షం వరదల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడమే కాకుండా విద్యుత్తు సప్లైకి అంతరాయం ఏర్పడి త్రాగునీటి  సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 

ఆదిలాబాద్‌:
మహిళకు పురిటి నొప్పులు రావడంతో అతికష్టంగా గిరిజనులు వాగు దాటించారు. ఈ ఘటన ఆదిలాబాద్  జిల్లాలోని మల్లాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతోవాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది. పైగా  ‌కల్వర్ట్ పై నుంచి నీరు ప్రవాహిస్తోంది. అయినప్పటికీ  గిరిజన మహిళలను ఉప్పోంగే వరద ఉదృతిలో వాగులో చేతులు పట్టుకొని మరి గర్బీణీ మహిళను  వాగు దాటించారు.  వాగు దాటించిన ఆనంతరం 108లో  వాహనంలో అసుపత్రికి  తరలించారు.

జూరాలకు పెరుగుతన్న వరద
మహబూబ్‌నగర్‌: గడచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  ప్రియదర్శిన జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండంగా అవుట్‌ఫ్లో 12 వేల 225 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రాల్లో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పాదన కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.130 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి సామర్ద్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.969 టీఎంసీలుగా ఉంది. కుడి,ఎడమ కాలువలతోపాటు నెట్టెంపాడు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.

అయితే ఎగువ కర్ణాటకలో  భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి,నారాయణపూర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ నీళ్లు బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం వరకు జూరాల చేరే అవకాశం ఉందని జూరాల ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వరద ఉదృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీతీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు.

జగిత్యాల:
రాయికల్ మండలం మండల కేంద్రంలోని బోర్నపెల్లి గ్రామంలోని గోదావరి నది మధ్యలో తొమ్మిది మంది రైతు కూలీలు చిక్కుకున్నారు. గోదావరి మధ్యలో ఉన్న గుట్ట ప్రాంతంలో చిక్కుకుకున్నారు. వారం రోజుల పాటు వ్యవసాయ పనుల రీత్యా కూలీలు నిత్యావసరాలు తీసుకొని వెళ్లారు. అయితే గుట్ట చుట్టూ మూడు వైపులా గోదావరి పాయలు ఉధృతంగా ప్రవహిస్తోందటంతో వీడియో కాల్స్ ద్వారా స్థానికులు బంధువులకు సమాచారం అందించి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు రంగంలోకి చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు