శ్రీశైలం @ 150 టీఎంసీలు 

27 Jul, 2021 00:46 IST|Sakshi

కృష్ణా, తుంగభద్రల్లో కొనసాగుతున్న వరద ఉధృతి 

శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 

‘తుంగభద్ర’నుంచి 1.49 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది, దాని ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగానే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదులుతున్నారు. దాంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 871.8 అడుగుల నీటిమట్టంతో నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 65 టీఎంసీల నీరు అవసరం.

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 25,427 క్యూసెక్కులను విడుదల చేస్తోంది. ఆ జలాలు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక్కడ కూడా విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని తెలంగాణ దిగువకు వదులుతోంది.

ఇక తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌ నిండిపోయింది. దాంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. కృష్ణా వరదకు, తుంగభద్ర ప్రవాహం తోడవుతున్న నేపథ్యంలో మంగళవారం శ్రీశైలంలోకి వరద ఉధృతి పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్రంలో 43,870 చెరువులకు గాను 23,400 చెరువులు నిండాయి. 

మరిన్ని వార్తలు