వామ్మో.. ఆ నీళ్లు తాగితే డైరక్ట్‌ దవాఖానానే..

12 Aug, 2021 08:47 IST|Sakshi

పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు కలుషితం 

ఆయా ప్రాంతాల్లోని నీటిలో ప్రమాదకర మూలకాల ఉనికి 

ఎన్‌జీఆర్‌ఐ ప్రాథమిక అధ్యయనంలో వెల్లడి 

డిసెంబరు నాటికి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో భూగర్భజలం తీవ్రంగా కలుషితమైంది. పలు పరిశ్రమలు విడుదల చేస్తున్న పారిశ్రామిక వ్యర్థజలాలను నాలాలు, బహిరంగ ప్రదేశాలు, వట్టిపోయిన బోరుబావుల్లో వదిలివేస్తున్నారు. దీంతో భూగర్భ జలాల్లో భారలోహాలు, నైట్రేట్‌లు, పాస్ఫరస్‌ తదితర మూలకాల ఉనికి కనిపించినట్లు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ప్రాథమిక అధ్యయనంలో తేలింది. పూర్తిస్థాయి నివేదిక ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి సిద్ధమవుతుందని ఆ సంస్థ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. 

భూగర్భ జల కాలుష్యానికి ప్రధాన కారణాలివే.. 
► మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాలు, చెరువుల నీటి నమూనాలను ఇటీవల ఎన్‌జీఆర్‌ఐ (జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ) సేకరించి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించింది. 
► ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్‌చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు, నైట్రేట్‌లు, పాస్ఫరస్‌ అధికంగా ఉండడంతోపాటు భార లోహాల ఉనికి బయటపడింది.   
►  పలు రసాయన, బల్‌్కడ్రగ్, ఫార్మా పరిశ్రమల నుంచి బహిరంగ ప్రదేశాలు, సమీప చెరువులు, నాలాలు, మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరడం. ఈ జలాలు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతున్నాయి. 
►  రోజువారీగా గ్రేటర్‌లో 1400 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో 700 మిలియన్‌ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు.  
►  మిగతా 700 మిలియన్‌ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండానే మూసీలో కలుస్తున్నాయి. 
► ఇందులో సుమారు 350 మిలియన్‌ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థజలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భజలాల్లోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి. 

భూగర్భజలాల్లో ఉన్నమూలకాలు, భారలోహాలివే.. 
సోడియం, క్యాల్షియం, మెగీ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్, నైట్రేట్, పాస్ఫరస్‌. ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలశాఖ నెలవారీగా భూగర్భ జలమట్టాలను లెక్కిస్తోంది. ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో బోరుబావులు తవ్వి భూగర్భజలాల నాణ్యత ను ఎన్‌జీఆర్‌ఐ సౌజన్యంతో పరిశీలించనుంది. ఈ వివరాలను జీఐఎస్‌ మ్యాపుల్లో పొందుపరిచి భూగర్భజలశాఖ వెబ్‌సైట్‌లో అందరికీ లభ్య మయ్యేలా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఆ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి నగరంలో పారి శ్రామిక వాడలతోపాటు ఇతర ప్రాంతాల్లో భూ గర్భజలాల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదికను ఎన్‌జీఆర్‌ఐ సిద్ధం చేయనుందని వెల్లడించాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు