డేటా ఎంబసీలను ఇక్కడ ఏర్పాటు చేయండి

17 Feb, 2023 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డేటా ఎంబసీలను కేవలం గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి అత్యంత కీలకమైన డేటా ఎంబసీలను మొత్తానికి మొత్తంగా కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలనుకుంటున్న గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీ భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న భౌగోళిక ప్రాంతమని, దీంతో పాటు దేశ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రంలో డేటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదంతో కూడుకున్నదని తెలిపారు.

హైదరాబాద్‌ నగరానికి భౌగోళికంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి సహజ రక్షణ, అనుకూలతలు ఉన్నాయని వివరించారు. భారత దేశంలోనే అత్యంత సురక్షితమైన సెస్మిక్‌ జోన్‌–2లో హైదరాబాద్‌ నగరం ఉన్నదని, అందుకే ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం అత్యుత్త మమైన నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న గిఫ్ట్‌ సిటీ సెస్మిక్‌ జోన్‌ 3, సెస్మిక్‌ జోన్‌ –4కి అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతమని, తద్వారా ఇక్కడ భూకంపాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొత్తం డేటా ఎంబసీల కార్యకలాపాలు స్తంభించి, ఆ ప్రభావం అంతర్జాతీయ సంబంధాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెజాన్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ వరకు అన్నీ హైదరాబాద్‌లోనే..
అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో విస్తృతమైన అధ్యయనాలను చేసి, తెలంగాణను తమ డేటా సెంటర్లకు అనువైన కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని కేటీఆర్‌ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ మొదలుకొని మైక్రోసాఫ్ట్‌ వరకు అనేక కంపెనీలు హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్లను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. 2016 లోనే తెలంగాణ ప్రభుత్వం తమ డేటా సెంటర్‌ పాలసీని ప్రకటించిందని, ఇందులో భాగంగా డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్‌ పాలసీ అత్యంత ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. 

నిర్ణయాన్ని పునఃపరిశీలించండి
డేటా ఎంబసీలను కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ బడ్జెట్లో ప్రతి
పాదించిన డేటా ఎంబసీలను దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.తద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఈ విషయంలో సమాన అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందని కేటీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు