జనశక్తి  నేతలు రాజన్న, అమర్‌ విడుదల

26 Aug, 2023 02:41 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్‌ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్‌కు తరలించారు.

శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్‌ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది.

అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 

అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్‌ 
దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు.

శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు.

మరిన్ని వార్తలు