ప్రగతి భవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి ఓవర్‌ యాక్షన్‌

20 Jan, 2022 03:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అపాయింట్‌మెంట్‌ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో ప్రగతిభవన్‌కు వచ్చిన జేసీ లోపలికి అనుమతించాలని కోరగా... అపాయింట్‌మెంట్‌ లేకుండా అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు.

తాను మాజీ మంత్రినని, సీనియర్‌ రాజకీయ నేతనని.. సీఎంను కలిసేందుకు తనకు కూడా అపాయింట్‌మెంట్‌ కావాలా? అని వారితో వాగ్వాదానికి దిగారు.  కనీసం మంత్రి కేటీఆర్‌ను అయినా కలుస్తానని జేసీ కోరగా.. ఆయనను కలవాలన్నా అపాయింట్‌మెంట్‌ తప్పనిసరని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ఫోన్‌ చేసి తాను వచ్చినట్టు సమాచారం ఇవ్వాలని పోలీసులను కోరగా.. ఫోన్‌ నంబర్‌ తమ వద్ద ఉండదని.. మీరే ఫోన్‌ చేయండని.. ఆయన పంపమంటే పంపుతామని బదులిచ్చారు.  15 నిమిషాలపాటు పోలీసులతో వాగ్వాదానికి దిగినా.. లోపలికి పంపేందుకు ససేమిరా అనడంతో.. ఈసారి అపాయింట్‌మెంట్‌ తీసుకునే వస్తానంటూ వెళ్లిపోయారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.   

చదవండి: జీవో 317పై స్టేకు హైకోర్టు నిరాకరణ

మరిన్ని వార్తలు