జూబ్లీ జర్నీ.. ఇక జిగేల్‌

5 Aug, 2020 08:28 IST|Sakshi
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 రూట్‌లో పూర్తయిన ఎలివేటెడ్‌ కారిడార్‌

రోడ్‌ నెంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు పూర్తి 

పొడవు 1.7 కి.మీ, వెడల్పు 16 మీ. 

దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జికి అనుసంధానం

అంచనా వ్యయం రూ.150 కోట్లు 

పంజగుట్ట, జూబ్లీహిల్స్‌ల నుంచి ఐటీ కారిడార్‌కు సాఫీ ప్రయాణం

త్వరలో ప్రారంభం 

సాక్షి, సిటీబ్యూరో: కోర్‌సిటీలోని ఖైరతాబాద్, పంజగుట్ట, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల నుంచి మైండ్‌స్పేస్, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు.. ఆప్రాంతాల నుంచి కోర్‌సిటీలోకి వచ్చే ప్రయాణికులు ఇక సాఫీగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చేపట్టిన పనుల్లోని ‘జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌’ పనులు పూర్తయ్యాయి. లాక్‌డౌన్‌ సమయాన్ని బాగా వినియోగించుకొని పనుల్ని వడివడిగా చేయడంతో కారిడార్‌  పనులు పూర్తయ్యాయి. బ్లాక్‌టాప్, లేన్‌మార్కింగ్‌లు కూడా పూర్తయి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. అయితే దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జికి సంబంధించిన ప్రత్యేక దీపకాంతుల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాకే దాంతోపాటు దీన్నీ ప్రారంభించాలనేది ప్రభుత్వ యోచన. దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి పనులు కూడా పూర్తయినప్పటికీ విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యేందుకు దాదాపు  రెండు వారాలు పట్టవచ్చునని తెలుస్తోంది.

జూబ్లీ చెక్‌పోస్ట్‌ దగ్గరి నుంచి దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వరకు సాఫీగా సాగిపోయేందుకు రోడ్‌నెంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు చేపట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ, భూసేకరణ ఇబ్బందులతో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యాన్ని పూర్తిచేయడంతో పాటు మరింత త్వరితంగా పనులు చేసేందుకు లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ నుంచి ఐటీకారిడార్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్‌నెంబర్‌ 36ను ఎక్కువగా వినియోగించుకుంటుండంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఐటీకారిడార్‌లో ఉద్యోగాలు చేసే లక్షల మంది రోడ్‌నెంబర్‌ 36 మీదుగానే హైటెక్‌సిటీ, మాదాపూర్, ఖాజాగూడ తదితరప్రాంతాలకు వెళ్తున్నారు. రద్దీ సమయాల్లో గంటకు దాదాపు 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. కారిడార్‌ 45 వినియోగంలోకి వస్తే ఈ రద్దీ తగ్గుతుంది. రోడ్‌నెంబర్‌ 36తోపాటు మాదాపూర్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పుతాయి.  

రోడ్‌నెంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ ఇలా.. 
జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45 నుంచి దుర్గం చెరువు  కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు అనుసంధానంగా దీన్ని నిర్మిస్తున్నారు.
అంచనా వ్యయం: రూ.150 కోట్లు 
ఫ్లై ఓవర్‌ పొడవు: 1.7కి.మీ. 
ఫ్లై ఓవర్‌ వెడల్పు :16.60 మీటర్లు(4 లేన్లు) 
పనులు ప్రారంభం : ఏప్రిల్‌ 2018 
పనులు పూర్తి :ఆగస్ట్‌ 2020

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు