శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

20 Jan, 2022 05:21 IST|Sakshi
ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన అనంతరం మండలి ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీతో దామోదర్‌రెడ్డి, కవిత. చిత్రంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ తదితరులు

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించిన ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీ  

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బుధవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో కవిత, దామోదర్‌రెడ్డితో ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ ప్రమాణం చేయించారు. కోవిడ్‌ నేపథ్యంలో కొద్ది మందిని మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రొటెమ్‌ చైర్మన్‌ చాంబర్‌లోకి అనుమతించారు. కవిత ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసన మండలికి తరలివచ్చారు.

ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కవిత, దామోదర్‌రెడ్డికి ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ జాఫ్రీ, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచార్యులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఎంపీలు సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఎంఎస్‌ ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, ఫారూక్‌ హుస్సేన్, వాణీదేవి, భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ, ఎమ్మెల్యేలు గణేశ్‌ గుప్తా, గంప గోవర్ధన్, షకీల్‌ అహ్మద్, సంజయ్, సురేందర్, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.

కాగా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు కవిత ధన్యవాదాలు తెలిపారు. తనను మండలికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ బారిన పడిన అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కవిత వెల్లడించారు.  

నేడు ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం..  
ఖమ్మం స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన తాతా మధు గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరీంనగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ఈ నెల 27న ప్రమాణం చేయనున్నారు.   

మరిన్ని వార్తలు