బడ్జెట్‌లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి

22 Feb, 2022 02:32 IST|Sakshi

కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.  

మరిన్ని వార్తలు