వెయ్యి కోట్లతో ‘మాస్‌’... జీసీసీ

12 Jan, 2021 05:17 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ 

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి 

సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయనున్న మాస్‌ మ్యూచువల్‌ కంపెనీ 

లక్షా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు 

ఇప్పటికే 300 మంది నియామకం 

భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు 

అన్నివిధాలుగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ 

సాక్షి, హైదరాబాద్:‌ అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌లో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌కు మరో దిగ్గజ సంస్థ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్‌ మ్యూచువల్‌ ఇన్సూరెన్స్‌ (మాస్‌ మ్యూచువల్‌) కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌ నగరంలో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దశల వారీగా ఈ పెట్టుబడులను మాస్‌ మ్యూచువల్‌ సంస్థ పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు నేపథ్యంలో మాస్‌ మ్యూచువల్‌ ఇండియా అధిపతి రవి తంగిరాల, సంస్థ కోర్‌ టెక్నాలజీ విభాగాధిపతి ఆర్థర్‌ రీల్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌లతో మాట్లాడారు. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ కోసం మాస్‌ మ్యూచువల్‌ సంస్థ ఇప్పటికే నియామకాలను చేపట్టిందని, 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించనుందన్నారు.

ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌లో లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌ నగరాన్ని తమ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకున్నాయని, ఈ రోజు 170 సంవత్సరాల చరిత్ర కలిగి, ‘ఫార్చూన్‌ 500’కంపెనీల్లో ఒకటిగా ఉన్న మాస్‌ మ్యూచువల్‌ అమెరికా వెలుపల తమ మొదటి గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారిందని మరోసారి రుజువైందన్నారు. రానున్న కాలంలో నగరంలో కంపెనీ పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో ప్రపంచస్థాయి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంలో రవి తంగిరాల చూపిన చొరవను కేటీఆర్‌ అభినందించారు. 

హైదరాబాద్‌ ది బెస్ట్‌: రవి తంగిరాల 
మాస్‌ మ్యూచువల్‌ గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించామని, హైదరాబాద్‌లో చక్కటి నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ సానుకూల విధానాలకు ఆకర్షితులై ఈ నగరాన్ని ఎంపిక చేశామని మాస్‌ మ్యూచువల్‌ ఇండియా హెడ్‌ రవి తంగిరాల పేర్కొన్నారు. 1851లో ఏర్పాటైన తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక, ఇన్సూరెన్స్‌ సేవలను అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ ద్వారా తమ లక్ష్యాలు, అవసరాలను ఇక్కడ ఉన్న టాలెంట్‌ పూల్‌ సహకారంతో అందిపుచ్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కంపెనీ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, సపోర్ట్, ఇంజనీరింగ్‌ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా భారీ ఎత్తున తమ కంపెనీ నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలోని నిపుణులైన ఉద్యోగుల ద్వారా తమ ఇన్నోవేషన్‌ లక్ష్యాలను కచి్చతంగా అందుకుంటామన్న విశ్వాసాన్ని ఆర్థర్‌ రీల్‌ వ్యక్తం చేశారు.  

జీసీసీలు ఏం చేస్తాయి?
గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి. బ్యాక్‌ ఆఫీసు సేవలు, కార్పొరేట్‌ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్‌ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి. అలాగే ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్‌ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్‌ ఐటీ ఇ్రన్ఫాస్ట్రక్చర్, హెల్ప్‌ డెస్క్‌లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. ఈ ఏకీకృత సేవల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయి. కొన్ని పెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఈ జీసీసీలను నూతన అవిష్కరణల కేంద్రాలుగా కూడా ఉపయోగించుకుంటాయి. ఈ సామర్థ్య కేంద్రాల మూలంగా మాతృసంస్థలకు మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో నిర్వహణ వ్యయంలో సగటున దాదాపు 45 శాతం వరకు ఆదా అవుతుందని అంచనా.  

మరిన్ని వార్తలు