బలవంతంగా రుద్దడం సరికాదు.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ

13 Oct, 2022 04:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానం ఆమోదయోగ్యం కాదని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు గల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సారథ్యంలోని ‘అధికార భాషలపై నియమించిన పార్లమెంటరీ కమిటీ’ నివేదికను అమలు చేయొద్దని కోరారు. ఈ మేరకు కేటీఆర్‌ బుధవారం ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలంటూ ఆ కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించడం శోచనీయమన్నారు.

కేవలం 40 శాతం ప్రజలు మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదని, రాజభాషగా హిందీకి పట్టం కట్టలేదని స్పష్టం చేశారు. 22 భాషలను అధికారిక భాషలుగా రాజ్యాంగం గుర్తించిందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, బహుళజాతి సంస్థల్లో మన యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లిష్‌ మీడియంలో చదవడమే కారణమని చెప్పారు. మోదీ ప్రభుత్వ ‘హిందీ’ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షలు హిందీ మీడియంలోనేనా..?
కేంద్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల నియా మక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కాకుండా హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్‌ అన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటూ, మళ్లీ హిందీకే ప్రాధాన్యమిస్తు న్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువతీయువకులకు వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని 2020 నవంబర్‌ 18న కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని గుర్తుచేశారు.

ఇంకా బ్రిటిష్‌ వలసవాద విధానమేనా?
ఢిల్లీలో కొందరు బ్యూరోక్రాట్లు, నేత లు ఇంకా బ్రిటిష్‌ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారని, అందుకు ఇంగ్లిష్, హిందీలోనే ఉన్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల ప్రశ్నపత్రాలే సాక్ష్యమని కేటీఆర్‌ విమర్శించారు. ‘అఖిల భారత సర్వీసులంటూ అధిక శాతం పరీక్షలను ఆంగ్లం, హిందీల్లోనే నిర్వహించడం వల్ల మాతృభాషల్లో చదువుకుని ఆయా అంశా లపై పట్టున్న అభ్యర్థులు నష్టపో తున్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంతోపాటు మెయిన్స్, ముఖా ముఖిలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారుల తోనే బోర్డులు ఏర్పాటుచేయాలి.

యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్, ఎకనా మిక్‌ సర్వీసు పరీక్షలతోపాటు గిరిజనులు, గ్రామీణుల తో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారుల ఎంపికలోనూ ఇంగ్లిష్‌కు మాత్రమే పెద్దపీట వేయడం అన్యాయం. బ్యాంకుల్లో ప్రాంతీయ భాష తెలియని సిబ్బందితో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పారు. సివిల్స్, రైల్వే, ఎస్‌ఎస్‌సీ, పోస్టల్, రక్షణ, నెట్‌ పరీక్షలతోపాటు కేంద్రం నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసే విష యమై నిపుణుల కమిటీని నియమించా లని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు