కళ్లారా చూసుకోవద్దా..

31 Mar, 2022 03:27 IST|Sakshi
ప్రధానాలయం ముఖ మండపంలో స్వయంభూలను దర్శించుకునేందుకు క్యూలైన్‌లో నిల్చున్న భక్తులు  

బంగారు వాకిలినుంచే యాదాద్రీశుని దర్శనం

గర్భాలయంలోకి అనుమతించాలంటున్న భక్తులు

సాక్షి, యాదాద్రి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భక్తులకు యాదగిరీశుని కనులారా దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉద్ఘాటన అనంతరం యాదాద్రీశుని సంపూర్ణ దర్శనం లభించడం లేదు. తిరుమల తరహాలో బంగారు వాకిలి నుంచే శ్రీ స్వామివారి దర్శనానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు.

దీంతో ఆరేళ్ల తర్వాత గర్భాలయంలోని స్తంభోద్భవుని దర్శనం కోసం తపిస్తున్న భక్తులు ఇక్కడికి రాగానే నిరాశగా వెనుదిరుగుతున్నారు. గతంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించి దగ్గర నుంచి స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

ఆనవాయితీకి విరుద్ధంగా..: యాదగిరిగుట్టలో స్వయంభూ దర్శనం గర్భాలయంలోనే కల్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆరేళ్ల నుంచి బాలాలయంలోనే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయం తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ పునరుద్ధరణలో భాగంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా గర్భాలయం ద్వారాలను కూడా వెడల్పు చేశారు.

దీంతో మరింత సులువుగా స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉన్నా భక్తులను వాకిలి (గర్భాలయం గడప వద్ద ) నుంచే పంపేస్తున్నారు. భక్తులు ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆనందపడుతున్నా.. స్వామి దర్శనం విషయంలో మాత్రం సంతృప్తి చెందడం లేదు. బుధవారం నుంచి ప్రారంభించిన సువర్ణ పుష్పార్చన ముఖ మండపంలోనే ప్రారంభించారు. 

వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులు
ప్రధానాలయంలోకి వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, బాలింతలు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి మెట్లమార్గాన దిగి దర్శనం అనంతరం పడమర రాజగోపురం వైపు మళ్లీ మెట్లెక్కి వెళ్లడం ఇబ్బందిగా మారింది. అలాగే క్యూలైన్‌లలో నిలబడేందుకు వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. 

గర్భగుడిలోకి అనుమతించాలి 
స్వామివారిని దర్శించుకోవడానికి 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నా. అలాగే కొత్త గుడి కట్టిన తర్వాత దర్శనానికి వచ్చా. కానీ అధికారులు బయటి నుంచే పంపించారు. భక్తులను గర్భాలయంలోకి పంపించి స్వామి నిజ దర్శనం కల్పించాలి. ఈ విషయంలో సీఎం మరోసారి ఆలోచించాలి. 
– మహాలక్ష్మి భక్తురాలు, హైదరాబాద్‌

త్వరలో అనుమతిస్తాం 
వేలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బంగారు వాకిలి నుంచే దర్శనం కల్పిస్తున్నాం. వీలైనంత త్వరలో గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం.
– గజ్వెల్లి రమేష్‌ బాబు, ఆలయ ఏఈఓ

మరిన్ని వార్తలు