బ్యాటరీ పరిశ్రమ వద్దేవద్దు

28 Dec, 2022 01:42 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఐటీ, సాఫ్ట్‌వేర్, అనుబంధ కంపెనీల స్థాపనను స్వాగతిస్తాం గానీ.. బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదు’ అని మహబూబ్‌నగర్‌ ప్రజలు తేల్చి చెప్పారు. పట్టణ సమీపంలోని దివిటిపల్లి ఐటీ కారిడార్‌ మైదానంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కలెక్టర్‌ వెంకట్రావ్, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందూలాల్‌ పవార్, పీసీబీ ఈఈ సంగీత హాజరుకాగా.. బాధిత గ్రామాలైన దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్ధాయిపల్లి గ్రామస్తులతోపాటు పర్యావరణ, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలు చెప్పారు. 
 
సందిగ్ధత.. అయినా అంగీకరించం 
దివిటిపల్లి పారిశ్రామికవాడలో బ్యాటరీ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఈ నెల 2న అమర్‌రాజా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.9,500 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. అయితే, బ్యాటరీల పరిశ్రమతో జల, వాయు కాలుష్యం వెలువడి.. సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే ఐటీ కారిడార్‌ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఆ కంపెనీ పేరు ప్రస్తావించ లేదు.

మెకానికల్‌ బ్యాటరీలు అని గానీ. ఎలక్ట్రానిక్‌ బ్యాటరీలు అని గానీ స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ అంశాన్ని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు. బ్యాటరీ తయారీ కంపెనీతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అక్కడి హైకోర్టు కూడా ఆ పరిశ్రమ వద్దని చెప్పిందని, బ్యాటరీ తయారీ వంటి కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని గ్రామస్తులు నినదించారు. 
 
ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ వద్దు 
శ్రీసాయి మానస నేచర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన కన్సల్టెంట్‌ ప్రతిపాదిత ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ప్రాజెక్ట్‌ను కూడా గ్రామస్తులు వ్యతిరేకించారు. సర్వే నంబర్‌ 556, 607లో సేకరించిన 377.65 ఎకరాల్లో రూ.568.49 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలు, డ్రోన్లు, ఐటీ పార్క్, మొబైల్‌ఫోన్ల ఉపకరణాలు, చార్జర్లు, డిస్‌ప్లే, కెమెరాలు తదితరాలను ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు.

దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించగా వందకు వంద శాతం మంది ఈ క్లస్టర్‌ ఏర్పాటుపై వ్యతిరేకగళం వినిపించారు. సంతకాల సేకరణ కో సం రిజిస్టర్‌లో ముందు పేజీలో స్థలం వదిలి సంతకాలు సేకరిస్తుండటంపై పలువురు ప్రశ్నించారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన ప్రతీ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 
 
ఊరు విడిచి వెళ్లాల్సిందే... 
గతంలో డైయింగ్‌ ప్లాంట్‌ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ ప్లాంట్‌ను తొలగించాలని ధర్నాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ స్పందించి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వ్యయం కావడంతో కంపెనీ వాళ్లే మూసేసుకున్నారు. ఆ నీరు తాగి పశువులు, చేపలు మృత్యువాత పడ్డాయి. గర్భిణులు, పిల్లలు దీర్ఘకాలిక రోగాలతో ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాటరీ పరిశ్రమ పెడితే మళ్లీ అలాంటి దుస్థితే వస్తుంది. అప్పుడు మేమంతా ఊరు విడిచి వెళ్లాల్సిందే.   
–హన్మంతు, రైతు, ఎదిర, మహబూబ్‌నగర్‌ 

మరిన్ని వార్తలు