వెన్నాచెడ్‌లో ‘మంగ్లీ’ సందడి  

8 Oct, 2020 13:20 IST|Sakshi

గండేడ్‌ (మహబూబ్‌నగర్‌): మండలంలోని వెన్నాచెడ్‌లో బుధవారం ప్రముఖ టీవీ యాంకర్‌ ‘మంగ్లీ’ సందడి చేశారు. గ్రామ శివారులోని బండమీది రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంగ్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు షూటింగ్‌లో పాల్గొన్న ‘మంగ్లీ’ని చూసేందుకు తరలివచ్చారు. చదవండి: (మంగ్లీ ‘తీజ్‌’ మార్‌)

బతుకమ్మతో మంగ్లీ

విదేశాలకు.. నడిగడ్డ మామిడి! 
గద్వాల: నడిగడ్డలో పండించే మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏడు ఉద్యాన పంటలను ఎగుమతి చేసే ఉద్దేశంతో క్లస్టర్‌ ఆధారిత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని మామిడితోటలను అధికారులు గుర్తించారు. దీంతో ఏపీఈడీఏకు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో పండ్లతోటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇక్కడి రైతులు మామిడితో పాటు బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటల పెంపకాన్ని చేపట్టారు. గ్లోబల్‌ గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ (జీఏపీ) ప్రమాణాలకు అనుగుణంగా మామిడిని రైతులు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగినపల్లి, దశేరి, దశేరి–35, హిమాయత్, పెద్దరసం, చిన్నరసం, సువర్ణరేఖ, కేసరి, తోతాపురి తదితర రకాలు ఉండాలి.

అనంతరం ఎగుమతి కోసం ఏపీఈడీఏ హర్ట్‌నెట్‌ వెబ్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రైతులు వ్యక్తిగతంగా గాని, ఉత్పత్తిదారుల సంఘాలుగా గాని ఏర్పడాలి. ప్రస్తుతం నడిగడ్డలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జీఏపీ ప్రమాణాలకు అనుగుణంగా మామిడిని పండించి ఎగుమతి చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. పది రోజుల నుంచి ఉద్యానశాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంతవరకు 17మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.  

రైతులకు శిక్షణ..  
అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ప్రొడక్టర్‌ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (ఏపీఈడీఏ) ఆధ్వర్యంలో జీఏపీ ప్రమాణాలపై రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే మామిడి యాజమాన్య పద్ధతులు, వాడాల్సిన ఎరువులు, ఇతర మందులు సూచిస్తారు. వాటిని ఎలా పండించాలో రైతులకు వారు ప్రత్యక్షంగా వివరిస్తారు. వాస్తవానికి జిల్లాలో మామిడి తోటలను రైతులు బాగా పండిస్తున్నారు. అయితే సరైన మార్కెట్‌ సౌకర్యాలు లేక ఆశించిన మేర ధరలు లభించడం లేదు. ఇలాంటి తరుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారికి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. దీంతో పాటు మార్కెటింగ్‌ ఇక్కట్లను అధిగమిస్తారు.  

రైతులను ప్రోత్సహిస్తున్నాం 
క్టస్టర్‌ ఆధారిత అభివృద్ధి పథకం కింద మామిడి తోటలు పెంచే రైతులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నాం. వివిధ రకాల ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఈసారి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం వచ్చినందున గిట్టుబాటు ధరలు లభిస్తాయి. – సురేష్‌ , జిల్లా ఉద్యానశాఖ అధికారి  

మరిన్ని వార్తలు