ఆ రూట్‌ ఉన్నా..లేనట్టే! మేడ్చల్‌– ఉందానగర్‌ మార్గంలో వాహనదారులకు బ్రేక్‌లు 

13 Feb, 2023 10:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అది సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల  మార్గం. మేడ్చల్‌లో రైలు ఎక్కితే నేరుగా ఉందానగర్‌ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి శంషాబాద్‌ విమానశ్రయానికి మరో ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఎంఎంటీఎస్‌ రెండో దశలో ఈ లైన్‌ను దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి చేసింది. జీఎమ్మార్‌ సంస్థ అనుమతిస్తే ఉందానగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు కూడా ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలనేది అప్పటి ప్రతిపాదన.

ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి మేడ్చల్‌ నుంచి ఉందానగర్‌ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్‌ నుంచి బొల్లారం వరకు రైల్వేభద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ.. ఆ మార్గంలో రైళ్లను ప్రారంభించాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ రైళ్లను నడిపేందుకు లైన్‌ క్లియర్‌గా ఉన్నా వెనుకడుగు వేస్తున్నారు.

కేవలం 10 కిలోమీటర్ల మార్గంలో కనీసం 10 చోట్ల లెవల్‌ క్రాసింగ్‌లు ఉండడమే ఇందుకు కారణం. వీటితో నగరవాసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. వాహనదారుల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణ లేకుండానే పట్టాలు పరిచారు. దీంతో  ఇప్పుడు ఆ లైన్‌ ఉన్నా లేనట్లుగానే మారింది. 

అక్కరకొచ్చేది ఎలా..? 
ఎంఎంటీఎస్‌ రెండో దశలో చేపట్టిన రైల్వే లైన్ల విస్తరణతో ఇప్పుడు మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా పూర్తి చేసిన ఫలక్‌నుమా– ఉందానగర్‌ మార్గంలోనే రైళ్లు నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకే కనీసం 10 చోట్ల లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్నాయి.

కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు  ఒకటి చొప్పున లెవల్‌ క్రాసింగ్‌ ఉంది. అంటే ట్రైన్‌ బయలుదేరిన  తర్వాత రెండు, మూడు నిమిషాలకోసారి గేట్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో  పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ రద్దీ నెలకోనుంది. దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, తుకారంగేట్, అమ్ముగూడ, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్నాయి. 

ఈ రూట్‌ పూర్తిగా కాలనీలు, బస్తీల్లోంచే వెళ్తుంది. దీంతో లెవల్‌ క్రాసింగ్‌లు తీసివేసేందుకు కొన్ని చోట్ల జనావాసాలను, దుకాణాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. పైగా  రైల్‌ ఓవర్‌ బ్రిడ్జీల (ఆర్‌ఓబీ)ను నిర్మించాలంటే చాలా చోట్ల భూమి లభ్యత సమస్యగా మారింది. ఈ క్రమంలో  రైల్‌ అండర్‌ బ్రిడ్జీలు (ఆర్‌యూబీ) ఒక్కటే పరిష్కారం.

ఇందుకు  ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన  తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో నిధుల  లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. లెవల్‌ క్రాసింగ్‌లు తొలగిస్తే తప్ప రైళ్లు నడపడం సాధ్యం కాదని  దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.    

మరిన్ని వార్తలు