ఘనంగా నాగోబా నూతనాలయ ప్రారంభం 

19 Dec, 2022 02:20 IST|Sakshi
నాగోబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన మెస్రం వంశీయులు   

నాగోబాతోపాటు సతీదేవతల విగ్రహాల ప్రతిష్టాపన 

భారీగా తరలివచ్చిన మెస్రం వంశీయులు, ఆదివాసీలు 

పాల్గొన్న ఎంపీ సోయం, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, కోనేరు కోనప్ప 

ఇంద్రవెల్లి: మెస్రం వంశీయులు రూ. 5 కోట్ల సొంత నిధులతో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వేకువజామున 4:30 గంటలకు కొడప వినాయక్‌రావ్, ఆత్రం పురుషోత్తం మహారాజ్‌ ఆధ్వర్యంలో నాగోబా విగ్రహంతోపాటు సతీదేవతల విగ్రహాల ప్రతిష్టాపన, కలశాల ఆవిష్కరణ జరిగింది.

ముందుగా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాల్లో విగ్రహాలను శుద్ధిచేసి ప్రతిష్టించారు. అనంతరం మెస్రం వంశీయులు హోమం నిర్వహించారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి ప్రారంభోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, కుమురం భీం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ దంపతులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

వారిని మెస్రం వంశీయులు సన్మానించారు. వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు, ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మెస్రం యువకులు ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు