18 వేల ఎకరాల్లో పంట నష్టం

17 Aug, 2020 17:00 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ : ప్రాథమిక అంచనా ప్రకారం కరీంనగర్ జిల్లాలో వర్షం వరదలతో 18 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు.‌ వర్షం వరదలతో కరీంనగర్‌లో జలమయమైన లోతట్టు ప్రాంతాలను, లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ) వరద పరిస్థితిని మేయర్ సునీల్ రావు, కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమీషనర్ క్రాంతితో కలిసి మంత్రి గంగుల పరిశీలించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని జేసీబీల సహాయంతో యుద్దప్రాతిపదికన బయటకు పంపించే చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ అదేశాల మేరకు జిల్లా కేంద్రంలోనే ఉంటూ వర్షం, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. (మోరంచ వాగులో చిక్కుకున్న కార్మికులు)

24 టీఎంసీల సామర్థ్యంగల ఎల్ఎండీలో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉందని మంత్రి అన్నారు. ఎల్ఎండీ పరివాహక ప్రాంతమైన మోయతుమ్మెద వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని తెలిపారు. మిడ్ మానేరులో 25 టీఎంసీలకు గానూ 20 టీఎంసీల నీరు నిల్వ ఉందని, మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండితే వరద దిగువకు ఎల్ఎండీకి వదిలే అవకాశం ఉందని దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారని తెలిపారు. కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇండ్ల మధ్యలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.

మరిన్ని వార్తలు