తక్షణమే బకాయిలు విడుదల చేయాలి 

27 Oct, 2022 01:36 IST|Sakshi
రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు  

కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

చౌటుప్పల్‌/చౌటుప్పల్‌ రూరల్‌: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.33,545 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని కేంద్ర నాయకులు గొప్పలు చెబుతున్నారని, అయితే ఆ నిధులన్నీ తమకు హక్కుగా వస్తున్న విషయా న్ని గమనించాలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు,

విభజన చట్టంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన రూ.1,350 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్ల రూపంలో రూ.723 కోట్లు, పౌష్టికాహారం కింద రూ.175 కోట్లు, స్టేట్‌ స్పెసిఫిక్, సెక్టార్‌ స్పెసిఫిక్‌ కింద ప్రతిపాదించిన రూ.3,024 కోట్లు, తెలంగాణకు బదులు పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.497 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నిక వేళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. కృష్ణానది జలాల్లో వాటా తేల్చకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు కేంద్రం అన్యా యం చేస్తోందన్నారు. మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్‌ మండలం పంతంగిలో బుధవారం రాత్రి మంత్రి రోడ్‌ షో నిర్వహించారు. 

మరిన్ని వార్తలు