అధికారం ఇచ్చినా ఏమీ చేయని అసమర్థులు

18 Aug, 2023 03:42 IST|Sakshi
తెల్లం వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి పువ్వాడ 

కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఆ పార్టీతో వెళ్తే కుక్క తోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే 

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను 95 సీట్లతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు 

తెల్లం వెంకట్రావు సహా పలువురు 

కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిక 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ఒక్కసారి అధికారం ఇవ్వండి అని కాంగ్రెస్‌ అడుగుతోంది. ఇప్పటి వరకు పది పదకొండు మార్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేని అసమర్థులు కాంగ్రెస్‌ నేతలు. వారు ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా వ్యవహరిస్తూ, పేదల కోసం పనిచేసే కేసీఆర్‌ను తిడుతున్నారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో చూడండి. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏం చేయాలో ఆలోచించుకుని ఓటు మాత్రం కేసీఆర్‌కు వేయండి’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్‌లో గురువారం మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా ఉన్న తెల్లం వెంకట్రావు, నెల రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా, గురువారం తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరిన వెంకట్రావుకు, మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్‌ పార్టీతో వెళ్లడం అంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘బీఆర్‌ఎస్‌ పార్టీకి మహారాష్ట్రలో అపార ఆదరణ లభిస్తోంది. రోజుకో పార్టీ విలీనంతో జాతీయ స్థాయిలో కేసీఆర్‌ శక్తిమంతమైన నేతగా ఎదుగుతున్నారు. బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో పునాది పడాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 95 సీట్లు ఇవ్వడం ద్వారా మన నాయకుడికి కొత్త శక్తి, ఉత్సాహం ఇవ్వాలి. ఇక్కడి తీర్పు మహారాష్ట్రలో ప్రతిధ్వనించేలా మీ నిర్ణయం ఉండాలి. రేపటి రోజున కేంద్రంలో మనం లేకుండా ఎవరూ ప్రధాన మంత్రి అయ్యే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు గెలిచేలా మద్దతు ఇవ్వండి’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 

జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదంతో ముందుకు 
గిరిజన పోరాట యోధుడు కొమురం భీం కోరుకున్న జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదం స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా కేసీఆర్‌తోనే సాధ్యమైందని, పొరుగున ఉన్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో మిషన్‌ భగీరథ, పోడు భూములకు పట్టాలు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, ఉచిత విద్యుత్‌ వంటి కార్యక్రమాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు గతంలో చెప్పిన సమ సమాజ స్థాపన ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోందని, పెరుగుతున్న సంపదతో పట్టణాలు, పల్లెల మధ్య అంతరం తగ్గుతోందని పేర్కొన్నారు.

60 ఏళ్లు అధికారంలో ఉన్నా, రూ.200 పింఛన్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పడు రూ.4 వేలు ఇస్తామని చెపుతోందని, అయితే కాంగ్రెస్‌ నాయకులు రూ.40 వేలు ఇచ్చినా ప్రజలు నమ్మబోరని కేటీఆర్‌ అన్నారు. యాదాద్రి ఆలయ స్థాయిలో భద్రాచలం ఆలయా న్ని అభివృద్ధి చేస్తామని, భద్రాచలానికి వరద ముప్పును తప్పించేందుకు కరకట్ట నిర్మిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకులు ఇప్పుడు తెలంగాణ అమరవీరులు, ఉద్యమం గురించి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు తాతా మధు, మధుసూదనాచారి, ఎంపీలు మాలోత్‌ కవిత, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో చేరారు.

మరిన్ని వార్తలు