బోరబండలో స్వల్ప భూకంపం

3 Oct, 2020 01:56 IST|Sakshi
భయంతో రోడ్డు పైకి వచ్చిన జనం

సాక్షి, హైదరాబాద్‌ : శుక్రవారం.. దాదాపు రాత్రి పది గంటలు దాటింది.. బస్తీల్లోని ప్రజలు అప్పుడప్పుడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమిం చారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు..ఒక్కసారిగా బాంబులు పేలాయా, లేక ఇళ్లు కూలాయో తెలియక అయోమయంలో ఉన్నారు. భూకంపం వచ్చిందని ఎవరో కేకలు వేశారు. ఒక్కసారిగా పిల్లా, పెద్దా, ముసలి, ముతకా అందరూ ఇళ్ళ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. బోరబండ డివిజన్‌ పరిధి లోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్‌–3లో శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన ఇది. సైట్‌–3 వీకర్‌సెక్షన్‌లోని సాయిరామ్‌నగర్, ఆదిత్యానగర్‌లలో భూకంపం వచ్చింది.

అక్కడి నుంచి పెద్దమ్మనగర్, జయవంత్‌నగర్, భవానీనగర్, అన్నా నగర్, రహమత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌హిల్స్‌ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా ప్రాణభయంతో హడలిపోయారు. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడేళ్ళ కిందట ఇలాంటి భూకంపం వచ్చిందని, ఇది ప్రమాదకరం కాదని ఎన్‌జీఆర్‌ఐ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీనగేశ్‌ శుక్రవారం ‘సాక్షి’కి తెలియజేశారు. రిక్టర్‌ స్కేల్‌పై 1.5 గా మాత్రమే నమోదైందని, ఇది ప్రమాదకరం కాదన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు