నిరాడంబరంగా తెప్పోత్సవం

13 Jan, 2022 04:24 IST|Sakshi

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే తెప్పోత్సవాన్ని బుధవారం నిరాడంబరంగా ఆంతరంగికంగానే జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా హంసవాహనంతో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి వారిని వేంచేపు చేశారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర తీర్థంతో సంప్రోక్షణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు, ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన, దర్బారు సేవలను జరిపించారు. ఇక గురువారం తెల్లవారుజామున నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాన్ని సైతం నిరాడంబరంగానే జరపనున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు.  

ముక్కోటి ఏకాదశి సందర్భంగా విద్యుత్‌ లైట్ల అలంకరణలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం 

మరిన్ని వార్తలు