హైటెక్‌ దందా.. బోర్డు తిప్పేసిన సంకల్ప్‌ మార్ట్‌! 

6 Dec, 2022 13:50 IST|Sakshi

డిపాజిట్‌ చేసిన వారికి లాభాల్లో వాటా 

ఇస్తామని నమ్మించి మోసగించిన సంస్థ 

వందల మంది నుంచి సుమారు 

రూ. 50లక్షల వరకు వసూలు 

మోర్తాడ్‌(బాల్కొండ): నిత్యావసర సరుకులు, ఎర్రచందనం మొక్కల వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాల్లో వాటా పొందవచ్చని, ఉన్నంతలో మనమూ కూడా ఆర్థికంగా ఎదగవచ్చని నమ్మించి భారీ మొత్తంలో డిపాజిట్‌లు సేకరించిన సంకల్ప్‌ మార్ట్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. రూ. వెయ్యి నుంచి ఎంత మొత్తమైనా పెట్టుబడి పెడితే రోజువారీగా కొంత ఆదాయం డిపాజిట్‌దారుల ఖాతాల్లో జమ చేస్తామని నమ్మించిన సంస్థ ప్రతినిధులు ఇప్పుడు ముఖం చాటేయడంతో సదరు సంస్థలో పెట్టుబడి పెట్టినవారు లబోదిబోమంటున్నారు. 

కాగా, విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న సంకల్ప్‌ మార్ట్‌ సంస్థకు మోర్తాడ్‌ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రతినిధులుగా వ్యవహరించారు. దాదాపు నాలుగు వందల మందితో రూ. 50లక్షల వరకు డిపాజిట్‌ చేయించారు. సంస్థలో పెట్టుబడి పెట్టినవారికి ఆన్‌లైన్‌లో లాగిన్‌ కావడానికి ఐడీ, పాస్‌వర్డ్‌ కూడా క్రియేట్‌ చేసి ఇచ్చారు. కొంత మందికి మొదట్లో రూ. వెయ్యి నుంచి రూ. 1,500ల వరకు లాభాలు వచ్చాయని నమ్మించి ఖాతాల్లో జమ చేయించారు. ఇలా లాభాలు పొందినవారి పేర్లు చెబుతూ తమ ఖాతాదారుల సంఖ్యను భారీగా పెంచుకున్నారు. 

కొన్ని రోజులపాటు సంస్థ ఆన్‌లైన్‌ లాగింగ్‌ పనిచేయగా గత నెలాఖరులో లాగిన్‌ పనిచేయడం స్తంభించింది. ఆన్‌లైన్‌లో లాగిన్‌ పనిచేయకపోవడంతో పెట్టుబడి పెట్టినవారికి అనుమానం వచ్చి సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. సంస్థ యజమానిగా చలామని అవుతున్న వ్యక్తి అరెస్టు అయ్యాడని అతను బైలుపై బయటకు రాగానే సంస్థ కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని ప్రతినిధులు నమ్మిస్తున్నారు. డిపాజిట్లు చేసిన వారు తమ సొమ్ము వాపసు చేయాలని సంస్థ ప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. 

ప్రశ్నించినవారు ‘రిమూవ్‌’.. 
సంస్థలో చేరిన వారితో ప్రతినిధులు ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేశారు. గ్రూపులో సంస్థ కార్యకలాపాలు ఎందుకు నిలిచిపోయాయి, తమ సొమ్మును ఎవరు వాపసు ఇస్తారు.. తమను చేర్పించిన ప్రతినిధులే బాధ్యత వహించాలని కొందరు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇలా ప్రశ్నిస్తున్న వ్యక్తులను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి సంస్థ ప్రతినిధులు తొలగిస్తున్నారని బాధితులు వాపోయారు. మరి కొందరు మాత్రం మున్ముందు ఏమైనా సమాచారం రావచ్చనే ఉద్దేశంతో వాట్సాప్‌ గ్రూప్‌లో ఉండిపోయారు. 

ఇదిలా ఉండగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన సంస్థ ఎలాంటిదో యజమానులు ఎలాంటివారో తమకు తెలియదని బాధితులు చెబుతున్నారు. తమకు సదరు సంస్థపై నమ్మకం కలిగించి తమతో పెట్టుబడి పెట్టించినవారే డబ్బులు వాపసు ఇప్పించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ముద్ర అనే సంస్థ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయగా ఇప్పుడు సంకల్ప్‌ మార్ట్‌ సంస్థ అదే కోవలో బోర్డు తిప్పేయడంతో అమాయకులు మోసపోయారు. 

మరిన్ని వార్తలు