పాతబస్తీ యువకుల షాన్‌ పహిల్వాన్‌..!

1 Feb, 2021 09:09 IST|Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట: దేశంలో ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా పాతబస్తి పహిల్వాన్లు సత్తాచాటుతున్నారు. తరాలు మారినా కుస్తీ పోటీల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బార్కాస్, ఎర్రకుంట పరిసరాల్లో ఎటు చూసినా పహిల్వాన్లే దర్శనమిస్తుంటారు. పహిల్వాన్‌గా తయారు కావడానికి ఇక్కడి యువకులు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. ఉన్నత విద్యావంతులు సైతం ‘సై’ అంటుంటారు. ఇందుకు గాను ప్రతిరోజు గంటల తరబడి దంగల్‌లలో కఠోర శ్రమ చేస్తారు. బాల కేసరి, హైదరాబాద్‌ కేసరీ, రుస్తానా ఏ డక్కన్, రాజీవ్‌గాంధీ కేసరీ, సాలార్‌ కేసరీ, ఆంధ్ర కేసరి తదితర పురస్కారాలు దక్కించుకుంటున్న బార్కాస్‌ పహిల్వాన్‌లు కుస్తీ పోటీలకు ఇంకా ప్రాధాన్యం తగ్గలేదని నిరూపిస్తున్నారు. బార్కాస్‌ ప్రాంతానికి చెందిన కాలేద్‌ బామస్, అబ్దుల్లా బిన్‌ గౌస్, మహ్మద్‌ బిన్‌ గౌస్‌ ఆంధ్ర కేసరీ టైటిళ్లను సాధించారు. ఖాలేద్‌ బిన్‌ అబ్ధుల్లా మహరూస్, హబీబ్‌ అబ్ధుల్లా అల్‌ జిలానీ, అబ్దుల్లా బిన్‌ గౌస్, మహ్మద్‌ బిన్‌ ఉమర్‌ యాఫై అలియాస్‌ మహ్మద్‌ పహిల్వాన్, మహమూద్‌ ఖాన్‌ తదితర ప్రముఖ పహిల్వాన్లు బా­ర్కాస్‌ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం.  

నేటికీ అదే ఆదరణ 
ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మల్లయోధులకు ప్రజాదరణ ఎక్కువే. రాజుల కాలంలో కుస్తీ పోటీలను ప్రత్యేకంగా నిర్వహించే వారు. ప్రస్తుతం రాజ్యాలు..రాజులు లేకున్నా...కుస్తీ పోటీలకు ఆదరణ తగ్గలేదు. బార్కాస్‌లో మల్లయోధులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిని ‘  పహిల్వాన్లు’గా పిలుస్తారు.  పహిల్వాన్లకు శిక్షణ ఇచ్చేవారిని ‘వస్తాద్‌’ లు అంటారు. బార్కాస్‌లో మల్లయోధులకు శిక్షణ ఇచ్చే అకాడాలు(తాలీం) ఉన్నాయి. ఐదేళ్ల వయస్సు నుంచి వీటిలో శిక్షణ పొందవచ్చు. ఇక్కడి అకాడాలలో శిక్షణ పొందిన వారు నగరంలోనే కాక డిల్లీ, మహారాష్ట్ర, సంగ్లీ, జంషెడ్‌పూర్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో నిర్వహించి కుస్తీ పోటీల్లో సత్తా చాటారు. ఆంధ్ర కేసరి నుంచి స్థానికంగా నిర్వహించే కేసరీలలో ప్రతిభ కనబరుస్తున్నారు.  
ఉదయం

4.30 గంటల నుంచే.. 
ఉదయం 4.30 గంటల నుంచే పహిల్వాన్లు వ్యాయామాన్ని ప్రారంభిస్తారు. ఇందులో డన్‌ బైటక్, సఫట్, తాడు ఎక్కడం, మట్టి తవ్వడం ముఖ్యమైనవి. డన్‌బైటక్‌ వ్యాయామం ద్వారా కాళ్లు, చేతులు బలంగా తయారవుతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో తమ స్థాయికి తగ్గట్లు ఐదు వందల నుంచి వెయ్యి వరకు దన్‌ బైటక్‌లను కొడుతారు. తాడు ఎక్కడం ద్వారా చేతికి పటుత్వం లభిస్తుంది. దంగల్‌లో మట్టిని తోడడం ద్వారా పక్కటెముకలు, వెన్నపూస, భుజాలు ధృడమౌతాయి.

పహిల్వాన్‌ మెనూ ఇదీ..
⇔ పహిల్వాన్‌లు ప్రతి రోజు పాలల్లో బాదం, అక్రోడ్, పిస్తా, కర్బూజా, ఇలాచీ, కాలీమిర్చి తదితర డ్రైప్రూట్స్‌ నానబెట్టి  పాలను చిలుకుతారు.
⇔ అనంతరం పాలను వడబోసి తాగుతారు. ఒక్కో çపహిల్వాన్‌ రోజూ లీటర్‌ నుంచి రెండు లీటర్ల వరకు  పాలను స్వీకరిస్తారు.
 వీటితో పాటు ఉదయం తాజా పండ్లు, కూరగాయలు మితంగా ఆహారాన్ని తీసుకుంటారు. 
 మధ్యాహ్నం వేళల్లో అరటి, పీచు కలిగిన పండ్లను, రాత్రి వేళల్లో మస్కా, నెయ్యితో చేసిన కూరగాయలు, అన్నం తింటారు.
 ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటిస్తారు. నూనె పదార్థాలను తీసుకోరు.  కేవలం నెయ్యితో  చేసిన కూర లు మాత్రమే భుజిస్తారు. 
 ప్రతి ఫహిల్వాన్‌కు రోజు రూ.300–400ల వరకు ఆహారం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేకంగా దంగల్‌.. 
మల్లయోధుల వ్యాయామం కోసం ప్రత్యేకంగా దంగల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ దంగల్‌లో ఎర్రమట్టిని వేసి ఆ మట్టిలో నెయ్యి, హారతి కర్పూరం, నిమ్మరసం, మంచినూనె, గంధం చెక్కల పౌడర్‌ తదితర వాటిని కలుపుతారు. శిక్షణ పొందే సమయంలో గాయపడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతారు. శిక్షణ సమయంలో శరీరం నుంచి వెలువడే చెమట కారణంగా వాసన రాకుండా కర్పూరం తదితరాలను వాడతారు.

12 ఏళ్లు కష్టపడ్డా..
12 ఏళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకుని ఆంధ్ర కేసరీ టైటిల్‌ సాధించాను. 2004లో ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కుస్తీ పోటీల్లో గెలిచి ఆంధ్రకేసరీ అందుకున్నా. ప్రస్తుతం బార్కాస్‌లోనే బామస్‌ అకాడా ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇస్తున్నా. అకాడ ఆధ్వర్యంలో ఏటా కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. పహిల్వాన్‌గా రూపొందాలంటే కఠోర శ్రమ తప్పనిసరి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరు గంటలు అకాడాలో గడపాల్సిందే. –ఖాలీద్‌ బామాస్, ఆంధ్రకేసరీ టైటిల్‌ విజేత  
 
పహిల్వాన్‌ కావాలని ఉంది..
చిన్నతనం నుంచి కుస్తీ పోటీలు చూస్తున్నా..పహిల్వాన్‌ కావాలన్న ఆశయంతో రహీంపురాలోని వ్యాయామశాలలో మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. బార్కాస్‌లో నిర్వహిస్తున్న పోటీల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నా. –రోహిత్‌ వాక్వాడే, పహిల్వాన్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు