రైల్వే టికెట్‌ రీఫండ్‌కు సరికొత్త అవకాశం.. వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులకు ఊరట 

5 Sep, 2022 10:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులు టికెట్‌ రీఫండ్‌ కోసం ఇక రిజర్వేషన్‌ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ రీఫండ్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా రీఫండ్‌ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్‌ టికెట్లకు సైతం విస్తరించారు.

రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల్లో టికెట్‌ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్‌ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్‌ కార్యాలయాల్లోనే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్‌ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్‌ టికెట్లకు సైతం ఆన్‌లైన్‌ రీఫండ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది. 

అరగంట ముందు చాలు... 
ఐఆర్‌సీటీసీ ద్వారా రిజర్వేషన్‌ బుక్‌ చేసుకొనే వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులు తమ ప్రయాణం నిర్ధారణ కాని పక్షంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో చేరిపోతాయి. కానీ కౌంటర్‌ టికెట్లకు ఆ అవకాశం లేదు. తాజా మార్పుతో కౌంటర్‌లో టికెట్లు తీసుకున్న వాళ్లూ ఆన్‌లైన్‌ రీఫండ్‌ చేసుకోవచ్చు. రైలు సమయానికి అరగంట ముందు కూడా రద్దు చేసుకోవచ్చు. కానీ టికెట్‌ డబ్బులు తీసుకొనేందుకు మాత్రం రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లవలసి ఉంటుంది. ‘ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట. రిజర్వేషన్‌ నిర్ధారణ అవుతుందని రైలు బయలుదేరే వరకూ ఎదురు చూసేవాళ్లు చివరి నిమిషంలో కౌంటర్లకు వెళ్లి టికెట్‌ రద్దు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికిది చక్కటి అవకాశం’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

30 శాతం కౌంటర్‌ టికెట్లు
► ప్రతి ట్రైన్‌లో 30 శాతం వరకు వెయిటింగ్‌ లిస్టు టికెట్లను ఇవ్వొచ్చు.18 నుంచి 24 బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల సంఖ్య మేరకు 300 వరకు వెయిటింగ్‌ లిస్టు టికెట్లను ఇస్తారు. కానీ చాలా సందర్భాల్లో 400 వరకూ వెయిటింగ్‌ లిస్టు జాబితా పెరిగిపోతుంది.  
► 70 శాతం మంది ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారానే టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. 30 శాతం మంది మాత్రమే కౌంటర్ల వద్దకు వెళ్తున్నారు.
చదవండి: నేతన్నల బీమాకు వీడిన చిక్కు 

మరిన్ని వార్తలు